అనధికారికంగా విధులకు గైర్హాజరైతే ఉపేక్షించం
నాగర్‌కర్నూల్: ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెంచేలా ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించాలని డీఈఓ రమేష్ కుమార్ అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ మండలంలోని ఎండబెట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇద్దరు ఉపాధ్యాయులు అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడంతో డీఈఓ ఆగ్రహం వ్యక్తంచేశారు. మండల విద్యాధికారికి సమాచారం లేకుండా.. సెలవు పెట్టకుండా గైర్హాజరైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంఈఓ భాస్కర్‌రెడ్డిని ఫోన్ ద్వారా ఆదేశించారు. సదరు ఉపాధ్యాయులు ఇద్దరు సోమవారం డీఈఓ కార్యాలయానికి వచ్చి లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ముందస్తు అనుమతి లేకుండా విధులకు అనధికారికంగా గైర్హాజరు అయితే ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రగతికి బాటలు వేసేలా ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం తాడూరు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలకు తొలిరోజు కేవలం 11 మంది విద్యార్థినులు హాజరు కావడంతో డీఈఓ అసంతప్తిని వ్యక్తంచేశారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థినులు వెంటనే హాజరయ్యేలా చూడాలని ప్రత్యేకాధికారిని ఆదేశించారు. కేజీబీవీలో డార్మెంటరీ, స్టోర్ రూం, కిచెన్, ప్లే గ్రౌండ్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్‌రూంలో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం రోజు ఉడకబెట్టిన కోడిగుడ్లు అందిస్తున్నారా అని ఆరా తీశారు. భోజనం తయారీకి వినియోగించే ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థిను ల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించాలని తెలిపారు. కాగా, పాఠశాలలో స్టాక్ ఎంట్రీతో పాటు ఇతర రిజిస్టర్లు పూర్తిస్థాయిలో నమోదు చేయకపోవడంపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఇద్దరు ఉపాధ్యాయులకు
షోకాజ్ నోటీసులు
డీఈఓ రమేష్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment