అర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలి
తిమ్మాజిపేట/బిజినేపల్లి: అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. ఆదివారం తిమ్మాజిపేట, బిజినేపల్లి తహసీల్దార్ కార్యాలయాల్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాసులుతో కలిసి మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం భూమి లేని నిరుపేదలను గుర్తించాలన్నారు. రైతుభరోసాకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సాగుయోగ్యంకాని భూములను గుర్తించి.. అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. అంతేగాక రేషన్‌కార్డుల జారీలో ఉన్నతాధికారుల సూచనలు పాటించాలన్నారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా పర్యవేక్షణ అధికారులు చూసుకోవాలన్నారు. ఆయా పథకాలకు గ్రామసభల్లో కూడా దరఖాస్తులు తీసుకోవచ్చని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సమావేశాల్లో మండల ప్రత్యేకాధికారి, డీఈఓ రమేష్ కుమార్, ఎంపీడీఓలు లక్ష్మీదేవి, కథలప్ప, తహసీల్దార్లు రామకృష్ణయ్య, శ్రీరాములు, ఏఓ కమల్‌కుమార్, నీతి తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
ఎవరూ ఆందోళన చెందవద్దు
అదనపు కలెక్టర్ అమరేందర్
Comments
Please login to add a commentAdd a comment