దరఖాస్తులతో బారులు
సంక్షేమ పథకాల కోసం తరలివచ్చిన ఆశావహులు
●
సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో చేపట్టిన సభలకు ఆశావహులు పోటెత్తుతున్నారు. ప్రభుత్వం ఆదివారం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించడంతోపాటు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేకంగా సభలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు సభలు చేపడుతుండగా.. తొలిరోజు జిల్లావ్యాప్తంగా మొత్తం 124 గ్రామ, 26 మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించగా.. మొత్తం 4,930 దరఖాస్తులు వచ్చాయి. రేషన్‌కార్డుతోపాటు రైతుభరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు ఇప్పటికే చేపట్టిన సర్వేలో లబ్ధిదారులను గుర్తించిన అధికారులు జాబితాను గ్రామసభల్లో ప్రజల ముందు ఉంచారు. అయితే లబ్ధిదారుల జాబితా పట్ల పలుచోట్ల దరఖాస్తుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నామని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
పేర్లు లేక నిలదీతలు..
ఇప్పటికే చేపట్టిన సర్వే ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తవగా, ఆ జాబితాను ప్రజల ముందు ఉంచేందుకు గ్రామసభలను నిర్వహిస్తోంది. అయితే జాబితాలో పేర్లు లేకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశకు గురవుతున్నారు. రైతుభరోసా కింద ఏడాదికి రూ.12 వేలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, అర్హులైన వారికి కొత్త రేషన్‌కార్డుల మంజూరు కార్యక్రమాలు చేపట్టింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద లబ్ధిదారులుగా కనీసం 20 రోజులపాటు ఉపాధి కూలీలుగా పనిచేసిన భూమిలేని రైతు కూలీలను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ మేరకు చాలా గ్రామాల్లో సదరు అధికారులు కనీస పనిదినాలను సైతం కల్పించలేదని, అలాంటి పరిస్థితుల్లో చాలామంది రైతు కూలీలకు పథకం దక్కడం లేదని వాపోతున్నారు. అమ్రాబాద్ మండలంలోని పలుగ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద లబ్ధిదారులుగా అనర్హులను గుర్తించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం కింద వ్యాపారులు, అనర్హులను ఎంపిక చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పథకాల వారీగా తొలిరోజు వచ్చిన దరఖాస్తులు ఇలా..
రేషన్‌కార్డులు 2,826
ఆత్మీయ భరోసా 473
ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి..
గతంలో ప్రజాపాలన సందర్భంగా రేషన్‌కార్డు కోసం దరఖాస్తులు ఇచ్చాం. వాటి ఆధారంగా జాబితా రూపొందిస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు ఎంపిక చేయలేదు. ఇప్పుడు గ్రామసభలో మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. ఇలా ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం అర్హులను గుర్తించి త్వరగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. – కుర్మయ్య,
శాయిన్‌పల్లి, బిజినేపల్లి మండలం
మా పేర్లు రాలేదు..
గ్రామంలో ప్రజాపాలనలో ఇప్పటికే ఇచ్చిన దరఖాస్తులను అధికారులు ఆన్‌లైన్ చేయలేదు. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామంలోని 200 మందికిపైగా లబ్ధిదారుల పేర్లు జాబితాలో రాలేదు. మా పేర్లు లిస్టులో లేకపోవడంతో అధికారులను అడిగితే మళ్లీ దరఖాస్తులు ఇవ్వమని చెబుతున్నారు. ఇప్పటికై నా దరఖాస్తులను సీరియస్‌గా తీసుకుని పథకాలు వర్తింపజేయాలి.
– బషీరొద్దీన్, కొట్ర, వెల్దండ మండలం
గతంలో ఇచ్చినవి మూలకే..
సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు గతంలో ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. వీటి ఆధారంగానే క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి లబ్ధిదారుల ఎంపిక సైతం పూర్తి చేసింది. అయితే ప్రజాపాలన దరఖాస్తులను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ చేయలేదు. దీంతో చాలామంది అర్హులకు సైతం జాబితాలో చోటు దక్కలేదు. గతంలో ఇచ్చిన దరఖాస్తులను మూలన పడేసి, కొత్తగా దరఖాస్తులు స్వీకరించడం పట్ల దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పలుచోట్ల లబ్ధిదారుల ఎంపికపై అసంతృప్తి
రేషన్‌కార్డులు, ఇందిరమ్మ భరోసా జాబితాలపై అభ్యంతరాలు
మరోసారి దరఖాస్తులకు అవకాశం
తొలిరోజు జిల్లాలో 124 గ్రామ, 26 వార్డుసభలు
ఇందిరమ్మ ఇళ్లు
1,557
రైతు భరోసా
74
Comments
Please login to add a commentAdd a comment