అర్హులందరికీ సంక్షేమ పథకాలు
నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారితో కలిసి గ్రామ, వార్డుసభలపై కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ వివరిస్తూ జిల్లావ్యాప్తంగా తొలిరోజు 122 చోట్ల గ్రామసభలు, 26 మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించినట్లు వివరించారు. జిల్లాలోని అర్హులైన ప్రజల నుంచి సంక్షేమ పథకాల మంజూరు కోరుతూ ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తు చేసుకోగా ఈ నెల 16 నుంచి 20 వరకు అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి అర్హుల జాబితా సిద్ధం చేశారన్నారు. ఈ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా.. ఇంకా అర్హులైన లబ్ధిదారులు ఉన్నారా అనే విషయాలను ప్రజల సమక్షంలో తెలుసుకోవడానికి గ్రామ, వార్డు సభలు ఏర్పాటు చేశామని, ఇందులో తనతోపాటు అదనపు కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొనడం జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఏ ఒక్క లబ్ధిదారుకు అన్యాయం జరగకుండా ఉండేందుకు అధికారులతో అనునిత్యం సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment