సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
బిజినేపల్లి: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని.. హైరిస్క్ ఉన్న గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఎంహెచ్‌ఓ కేవీ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని లట్టుపల్లి, బిజినేపల్లి, పాలెం పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది హాజరు, వ్యాక్సిన్ నిల్వలు, ఓపీ సేవలు, కాన్పుల వివరాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. జిల్లాలో హైరిస్క్ గర్భిణులను ఆశావర్కర్ల ద్వారా గుర్తించి, వారికి ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య సంరక్షణకు అవసరమైన సూచనలు చేయడంతో పాటు పౌష్టికాహారం తీసుకునేలా చూడాలన్నారు. గర్భిణుల చికిత్స, చిన్నారుల టీకాకరణ కోసం 102 వాహన సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు ఐహెచ్‌ఐపీ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ఆస్పత్రికి వచ్చే 30 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి రక్తపోటు, మధుమేహం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ విషయంపై క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. ప్రతి హైరిస్క్ గర్భిణికి సురక్షిత ప్రసవం అయ్యేలా చూడాలన్నారు. అనంతరం పాలెంలోని జిల్లా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌ను తనిఖీ చేశారు. పీహెచ్‌సీల్లో మందుల కొరత లేకుండా ప్రణాళికా బద్ధంగా సరఫరా చేయాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ వెంట ప్రోగ్రాం అధికారి డా.రవికుమార్, డీపీఓ రేణయ్య, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, ఎంపీహెచ్‌ఈఓ రాజేష్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment