అతివలకు అండగా..
●
జిల్లాకు చెందిన ఓ యువతి తల్లిదండ్రులు చూసిన
సంబంధం కాకుండా వేరే వ్యక్తిని వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా తల్లిదండ్రులు సఖి కేంద్రాన్ని
సంప్రదించారు. దీంతో ప్రేమ వివాహాలు ఆకర్షణ వల్ల చేసుకుని తర్వాత ఇబ్బందులకు గురవుతారని కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో మార్పు చెందిన యువతి తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని వివాహం చేసుకుంది.
తమిళనాడుకు చెందిన భార్యాభర్తలు ఇటీవల జిల్లాకు వలస వచ్చి కుటీర పరిశ్రమ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాయి. ఆమెకు నలుగురు ఆడ సంతానం కాగా.. మరోమారు ఆడపిల్ల జన్మించడంతో భర్త, అతని కుటుంబ సభ్యులు గదిలో బంధించి భోజనం పెట్టకుండా వేధించారు. దీంతో ఆమె ఓ బాటసారి ద్వారా హెల్ప్‌లైన్ నంబర్‌తో సఖి కేంద్రంను సంప్రదించడంతో ఆమెను రక్షించి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీసుకువచ్చారు.
అందుబాటులో ఉంటాం..
మహిళలు, యువతులు, బాలికలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై 181 నంబర్‌ను సంప్రదించవచ్చు. సఖి కేంద్రానికి వచ్చే బాధి తులతోపాటు ఇతర ప్రాంతాల్లో సమస్యల తో బాధపడుతున్న వారికి సైతం అండగా ఉంటున్నాం. బయట తమ బాధలను చెప్పుకోలేని మహిళలు సఖికేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. సఖి కేంద్రం ద్వారా బాధితులకు సహాయం అందిస్తున్నాం. మా సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటున్నారు.
– రాజేశ్వరి, డీడబ్ల్యూఓ
సత్వరమే స్పందిస్తున్నాం..
సఖి కేంద్రం తరపున మహిళలకు అండగా ఉంటున్నాం. వైద్యం, న్యాయ, పోలీసు సేవలతోపాటు ఆశ్రయం కూడా కల్పిస్తున్నాం. ఎవరికై నా ఇబ్బందులు కలిగితే సెల్ నం.99519 40181కు సమాచారం అందిస్తే సత్వరమే సిబ్బంది బాధితులకు రక్షణ కల్పిస్తారు. మహిళల రక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్నాం.
– సునీత, సఖి అడ్మినిస్ట్రేటర్
న్యాయ సహాయం, ఆశ్రయం..
జిల్లాలో మహిళలు, యువతులు ఆపద సమయంలో సఖి కేంద్రాన్ని సంప్రదిస్తే వెంటనే బాధితులకు న్యాయ సహాయం అందేలా చూస్తున్నారు. అలాగే సఖికేంద్రంలో 575 మంది మహిళలు, యువతులకు ఆశ్రయం కల్పించారు. 531 మందికి వైద్య సహాయం చేశారు. వివిధ కారణాలతో సఖి కేంద్రాన్ని సంప్రందించిన 2,095 మందికి కౌన్సెలింగ్ ఇప్పించారు. అలాగే 1,157 మంది మహిళలకు లీగల్ కౌన్సెలింగ్, 283 మందికి పోలీస్ కౌన్సెలింగ్ అందజేశారు. కేంద్రానికి వచ్చిన 52 మందికి సఖి కిట్లు అందించారు.
నాగర్‌కర్నూల్ క్రైం: మహిళలు, బాలికలకు ఏ సమస్య ఎదురైనా మీకు మేమున్నామంటూ ముందుకు వచ్చి న్యాయం చేసేలా సఖి కేంద్రం పనిచేస్తోంది. మహిళల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కృషిచేయడంతోపాటు గృహహింస, వరకట్నం, లైంగిక వేధింపులు వంటి సమస్యలు ఎదుర్కొంటూ బయటకు చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్న వారి వద్దకు వెళ్లి పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2019లో ప్రారంభించిన సఖి కేంద్రం ఎంతో మంది మహిళలను అక్కున చేర్చుకుని వారికి న్యాయం జరిగేలా చూస్తోంది. ఏ రకమైన ఇబ్బంది ఎదురైనా మహిళలు హెల్ప్‌లైన్ నం.181, ఫోన్ నం.08540– 298000, సెల్ నం.99519 40181 ద్వారా సఖి కేంద్రాన్ని సంప్రదిస్తే సిబ్బంది సకాలంలో స్పందించి సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నారు. గృహహింస, అత్యాచారం, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, తప్పిపోవడం, అపహరణకు గురికావడం, మోసం చేయడం, ప్రేమ వివాహం, వరకట్నం, ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు, ఈవ్‌టీజింగ్, వయో వృద్ధుల అవస్థలు వంటి సమస్యలపై కేసులు నమోదు చేస్తున్నారు. యువతులు, మహిళలకు అండగా ఉండేలా న్యాయ నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. న్యాయ సహాయం, తాత్కాలిక వసతి, వైద్యసేవలు, పరిహారం ఇప్పించేలా చూస్తున్నారు.
గృహహింస కేసులే అధికం
జిల్లాలో సఖి కేంద్రానికి వచ్చే కేసుల్లో ఎక్కువగా నమోదయ్యేవి గృహహింస, భార్యాభర్తల మధ్య తగాదాలు, అత్తామామల వేధింపులు, భర్తలు ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న కేసులే అధికంగా వస్తున్నాయి. మహిళలను వేధింపులకు గురిచేసిన వారిని సఖి కేంద్రాలకు పిలిపించి చట్టాల గురించి అవగాహన కల్పించి వారిలో మార్పు వచ్చేలా చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సఖికేంద్రంలో 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2,133 కేసులు నమోదు కాగా.. 2,083 కేసులు పరిష్కరించారు. మిగిలిన 32 కేసులు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 1,512 గృహ హింస, 91 వరకట్న వేధింపులు, 32 చీటింగ్, లవ్ అఫైర్, 53 కిడ్నాప్, మిస్సింగ్ కేసులు, 56 బాల్య వివాహాలు, 20 పోక్సో, 3 లైంగిక వేధింపులు, 2 అత్యాచార, 364 ఇతర కేసులు ఉన్నాయి.
బాధితులకు న్యాయ నిపుణులతో కౌన్సెలింగ్
వేధింపులు, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న వారికి చేయూత
1,512 గృహహింస, 91 వరకట్నం వేధింపుల కేసుల పరిష్కారం
ఆపదలో ఉన్న వారిని అక్కున చేర్చుకుంటున్న సఖి కేంద్రం
విస్తృతంగా ప్రచారం
చాలామంది మహిళలు, యువతులు తమకు సమస్య వస్తే ఎక్కడికి వెళ్లి తమ సమస్య పరిష్కారంతోపాటు న్యాయం జరుగుతుందనే విషయం తెలియపోవడంతో అలాంటి వారందరికీ సఖికేంద్రం గురించి విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. జిల్లాలోని వివిధ కళాశాలలు, పాఠశాలల్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడుల గురించి ఇప్పటి వరకు 451 అవగాహన సదస్సులు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment