తరగతి గదిలో సెల్‌ఫోన్ వినియోగిస్తే చర్యలు
కందనూలు: పాఠశాల తరగతి గదిలో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ వినియోగిస్తే చర్యలు తప్పవని డీఈఓ రమేష్ కుమార్ హెచ్చరించారు. శనివారం నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యాబోధన చేయకుండా సెల్‌ఫోన్‌లతో కాలక్షేపం చేస్తున్నట్లు గుర్తించిన డీఈఓ.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదిలో సెల్‌ఫోన్ వినియోగంతో విద్యా బోధనకు అంతరాయంతో పాటు విద్యార్థుల ఏకాగ్రత, ప్రభావం చూపుతుందన్న విషయంపై కనీస స్పృహ లేకపోవడం ఏమిటని సదరు ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో సెల్‌ఫోన్ వినియోగించవద్దని రాష్ట్ర విద్యాశాఖ సంచాలకుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఉపాధ్యాయులు తమ సెల్‌ఫోన్లను పాఠశాల కార్యాలయంలోనే ఉంచాలని డీఈఓ సూచించారు. అనంతరం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
‘పది’ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
కల్వకుర్తి టౌన్: పదో తరగతి విద్యార్థుల రీవిజన్‌పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈఓ రమేష్ కుమార్ సూచించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల, ఊర్కొండ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో బోధన తీరును పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అంతకు ముందు పలు రికార్డులను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment