పరస్పర బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
● ఉపాధ్యాయు స్పౌజ్ బదిలీలకు
ప్రభుత్వం ఆమోదం
● ఇక టీచర్ల సర్టిఫికెట్ల తుది పరిశీలన
● హామీ పత్రాల స్వీకరణలో
విద్యాశాఖ
అచ్చంపేట: స్థానికతను కోల్పోయి ఇతర జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్న టీచర్ల పరస్పర బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మ్యూచువల్ బదిలీల కోసం ఉపాధ్యాయుల దరఖాస్తులను పరిశీలించి.. హామీ పత్రాలు స్వీకరించి నివేదించాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డీఈఓలకు ఆదేశాలు జారీ అయ్యాయి. పరస్పర బదిలీలకు అంగీకార పత్రాలను ఇద్దరు ఉపాధ్యాయులు పూర్తి వివరాలతో సంతకాలు చేసిన పత్రం, అండర్ టేకింగ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న టీచర్ల హామీ పత్రం, ద్రువపత్రాల తుది పరిశీలన చేసి బుధవారంలోగా నివేదించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో జిల్లాలో ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో ఆయా టీచర్ల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించే పనిలో నిమగ్నమయ్యారు.
జీఓ 317తో నష్టపోయిన ఉపాధ్యాయులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం తాజాగా స్పౌజ్, అనారోగ్యం, పరస్పర బదిలీలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మ్యూచువల్ బదిలీల వైపు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో తక్కువ ఖాళీల నేపథ్యంలో స్పౌజ్ ద్వారా బదిలీ కోరే ఉపాధ్యాయులకు ఎక్కువ మందికి అవకాశం లేకుండాపోతుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో ఏ మేరకు ఖాళీలు ఉన్నాయో వాటిని మాత్రమే బదిలీ చేయాలని నిర్ణయించారు. జిల్లాకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేటగిరి ఉపాధ్యాయుల ఖాళీలు 50లోపు ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, తత్సమాన కేటగిరి టీచర్ల పోస్టులు 200 వరకు ఉన్నాయి. ఈ లెక్కన అన్ని క్యాడర్ల టీచర్లు 250లోపు ఉన్నట్లు తెలుస్తోంది. ఖాళీ లేని నేపథ్యంలో చాలా మంది టీచర్లు మ్యూచువల్ బదిలీల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పరస్పర బదిలీల కింద 46 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. జీఓ 317 స్థానికతను కాకుండా సీనియార్టీని పరిగణలోకి తీసుకుని జిల్లాలు కేటాయించారు. 2022 మార్చిలో పరస్పర బదిలీలకు అనుమతి ఇవ్వగా తాజాగా మరోసారి ఇచ్చారు. దీంతో ఖాళీలను బట్టి స్పౌజ్ కేటగిరిలో అవకాశం దొరకని పరిస్థితి ఉన్న టీచర్లు పరస్పర బదిలీకి మందుకొస్తున్నారు. పదవీ విరమణ పొందేవారు ఏ జిల్లాకై నా వెళ్లేందుకు ముందు వరుసలో నిలుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పరస్పర బదిలీల టీచర్ల వ్యక్తిగత పూచి పత్రాలు, సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు.
న్యాయం చేయాలి..
జీఓ 317 బాధిత టీచర్లను గుర్తించి స్థానిక జిల్లాలకు కేటాయించాలి. మంత్రివర్గ ఉపసంఘం కాలయాపనకు పరిమితమైంది. గత ప్రభుత్వం ఏదైతే వెసులుబాటు కల్పించిందో ప్రస్తుతం కూడా మ్యూచువల్, స్పౌజ్, మెడికల్ బదిలీలకు ప్రాధాన్యత ఇచ్చి జీఓ 317 బాధితులను విస్మరించింది. తక్షణమే ప్రభుత్వం పునరాలోచించి బాధిత ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలి.
– శ్రీధర్‌రావు,
జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ
కొందరికే అవకాశం..
ప్రభుత్వం చేపట్టిన మ్యూచువల్, స్పౌజ్ బదిలీల వల్ల కొంత మంది టీచర్లకే అవకాశం దక్కుతుంది. జీఓ 317తో నష్టపోయిన ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరుగుతుంది. మరోసారి మంత్రివర్గ ఉపసంఘం సమాయత్తం చేసి డిస్‌లోకేటెడ్, స్థానికత ప్రాతిపదికన ఎవరైతే ఇతర జిల్లాల్లో ఉన్నారో వారిని తక్షణమే సొంత జిల్లాలకు పంపించాలి. ఉద్యోగ విరమణ వయస్సు పెంపు ఆలోచన విరమించుకుని రిటైర్మెంట్ ఖాళీలను జీఓ 317 బాధితులకు కేటాయించాలి. – ఎం.రాంజీ, జీఓ 317 బాధిత ఉపాధ్యాయుడు
అంగీకార పత్రాలు అందజేయాలి
పరస్పర బదిలీల కోసం 46 మంది ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న టీచర్ల వివరాల పరిశీలన జరుగుతుంది. అంగీకార పత్రాలు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలి. జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ బదిలీ దరఖాస్తు చేసుకున్న టీచర్లు నూతనంగా పొందుపర్చిన నమూనాలో సంబంధిత డీడీఓ సంతకం, ముద్రతో జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో అందించాలి. రెండు సెట్లు నిజసేవా పుస్తకం (సర్వీసు బుక్)తో వెరిఫికేషన్ చేసుకుని అందజేయాలి. – రమేష్‌కుమార్, డీఈఓ
●
మ్యూచువల్ వైపే మొగ్గు
Comments
Please login to add a commentAdd a comment