No Headline
దొంగను పట్టుకొని కిలో 832గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
చౌటుప్పల్ సమీపంలో జులై 27న 2.1 కిలోల బంగారం అపహరించిన ముఠా
వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ సుధీర్‌బాబు
చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో గత నెలలో జరిగిన భారీ దారిదోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. చాకచక్యంగా భారీ దారిదోపిడీకి పాల్పడిన ముగ్గురు దొంగల్లో ఒకడిని అదుపులోకి తీసుకోవడంతోపాటు సొత్తును సైతం రికవరీ చేశారు. ఈ కేసు వివరాలను శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముంబాయిలోని పశ్చిమ గోరేగావ్‌లోని జవేరిబజార్‌లో ఉన్న ఏడీ జ్యువెలరీ దుకాణం యాజమాన్యానికి ముంబై, పూణెతోపాటుగా ఆంఽధ్రప్రదేశ్ రారష్ట్‌రంలోనూ జ్యువెలరీ దుకాణాలు ఉన్నాయి. వ్యాపారంలో భాగంగా ప్రధాన దుకాణం నుంచి ఇతర దుకాణాలకు బంగారు ఆభరణాలను తరచుగా తీసుకెళ్తుంటారు. గత నెల 26న 2.1కిలోల వివిధ రకాల ఆభరణాలను సంస్థకు చెందిన ఉద్యోగి పురోహిత్ భరత్‌కుమార్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని దుకాణానికి పంపించారు. అందుకోసం తరచుగా వినియోగించే ఆరెంజ్ ట్రావెల్స్‌లోనే టికెట్స్ బుకింగ్ చేసుకున్నారు. అనంతరం సదరు ఉద్యోగి అక్కడే చునాబట్టి బస్టాప్‌లో బస్సులో ఎక్కి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరాడు.
టిఫిన్ కోసం బస్సు ఆపిన సమయంలో..
ముంబాయి నుంచి బయలుదేరిన ట్రావెల్ బస్సు మరుసటి రోజు (27న) ఉదయం 09.30గంటల సమయంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ శివారు లక్కారం గ్రామ పరిధిలోని ఓ హోటల్ వద్ద టిఫిన్ చేసేందుకు డ్రైవర్ బస్సును ఆపాడు. ప్రయాణికులందరు తమ లగేజీని బస్సులోని విడిచి టిఫిన్ చేసేందుకు కిందకు దిగారు. 20నిమిషాల అనంతరం ప్రయాణికులు బస్సులోకి వెళ్లారు. అదే సమయంలో పురోహిత్ భరత్‌కుమార్ తాను బంగారాన్ని తీసుకెళ్తున్న బ్యాగును చూసుకోగా బంగారు ఆభరణాల పెట్టె కన్పించలేదు. వెంటనే విషయాన్ని యజమానికి తెలియజేశాడు. అక్కడి నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గుర్తించిన పోలీసులు
బంగారు ఆభరణాల దుకాణ సేల్స్ మేనేజర్ కునాల్ కొటారీ అదే నెల 28న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ముంబాయి నుంచి ఇతర రాష్ట్రాలను బంగారాన్ని రవాణా చేసే సంస్థలు, వ్యక్తుల గురించి బాగా తెలిసిన ముఠాల సభ్యులే ఈ పనిచేసి ఉంటారని పోలీసులు గుర్తించారు. ప్రధానంగా ఆరెంజ్ ట్రావెల్ బస్సులనే ప్రత్యేకంగా టార్గెట్ చేసే ముఠాలపై దృష్టిసారించారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను ప్రత్యేక బృందాలను పంపించారు. పోలీస్ బృందాలు ఆయా రాష్ట్రాలలో విచారణ చేశారు. అందులో భాగంగా ఈ ముఠా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినదిగా గుర్తించి ఆ రాష్ట్రంలోని ధార్ జిల్లా ధర్మపురి మండలానికి వెళ్లారు. అయితే, అక్కడ నిందితుల ఆచూకీ మాత్రం లభించలేదు.
హోటల్ వద్ద పట్టుబడిన నిందితుడు
దోపిడీకి పాల్పడిన ముగ్గురు సభ్యులుగల ఈ ముఠా ఘటనా స్థలం నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. కేవలం బంగారం రవాణా చేసే వ్యక్తులనే ఎంచుకునే ఈ ముఠాలు సరుకు రవాణా జరుగుతున్న బస్సులోనే ప్రయాణికులుగా ఎక్కుతారు. అలా ఎక్కిన తర్వాత అనువైన సమయాన్ని ఎంచుకొని దోపిడీకి పాల్పడుతారు. ఆ తర్వాత అప్పటికే అక్కడకు వచ్చే తప్పుడు నంబర్ ప్లేటు కలిగిన తమ వాహనంలో ఎక్కి పారిపోతుంటారు. అలానే చౌటుప్పల్ వద్ద బస్సులోని బ్యాగు నుంచి బంగారాన్ని తీసుకున్నాక అదే తరహాలో పారిపోయారు.
శుక్రవారం చౌటుప్పల్ మండల పరిధిలోని తూప్రాన్‌పేట గ్రామ శివారులోని ఆధ్య గ్రాండ్ హోటల్ వద్ద ఉన్న నిందితుడు సోనీ ఠాకూర్(22)ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద కిలో 832గ్రాముల వివిధ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు నిందితులైన అలీఖాన్, అస్లాంలు పరారీలో ఉన్నారు. కేసును ఛేదించిన అధికారులు, సిబ్బందిని సీపీ సుధీర్‌బాబు అభినందించారు. విలేకరుల సమావేశంలో భువనగిరి డీసీసీ రాజేష్‌చంద్ర, అదనపు డీసీసీ లక్ష్మినారాయణ, చౌటుప్పల్, భువనగిరి ఏసీపీలు మధుసూదన్‌రెడ్డి, రవికిరణ్‌రెడ్డి, చౌటుప్పల్ సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment