డేటా ఎంట్రీ వేగవంతం చేయాలి
నల్లగొండ: సమగ్ర కుటుంబ సర్వే వివరాల డేటా ఎంట్రీ ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం ఆమె వివిధ అంశాల పై జిల్లా అధికారులు, మండలాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీడీఓలు డేటా ఎంట్రీ బాధ్యతలను తీసుకుని ఆలస్యం కాకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. నల్లగొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో డేటా ఎంట్రీ కోసం కంప్యూటర్ కేంద్రాలను ఏర్పాలు చేసినట్లు చెప్పారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు ఎన్ని ఫారాలు ఇస్తున్నది.. తిరిగి వాటిని వెనక్కి తీసుకోవడం వంటివి క్రమపద్ధతిలో నిర్వహించాలన్నారు. ఎక్కడైనా పంచాయతీ కార్యదర్శులు సహకరించకపోతే వారిపై చర్య తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. అనంతరం హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లు, ఆసుపత్రుల్లో అందించే భోజనం నాణ్యవంతంగా ఉండాలన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. ఏ ఒక్క విద్యార్థి అనారోగ్యం పాలు కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి చెస్ పోటీల్లో సిల్వర్ మెడల్
నల్లగొండ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాలో జరిగిన 68వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 19 బాలుర విభాగంలో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మహమ్మద్ బాషిక్ ఇమ్రోజ్ జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించాడు. నల్లగొండ గౌతమి కళాశాలలో చదువుతున్న ఇమ్రోజ్‌ను శనివారం కళాశాల ప్రిన్సిపాల్ రంగారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, ఆర్బిటర్ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.
మాక్ టెస్టులకు దరఖాస్తుల స్వీకరణ
నల్లగొండ: గ్రూప్– 2 పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ యువతీ యువకులకు రెండు ఫ్రీ ఫుల్ లెన్త్ మాక్ టెస్టులు నిర్వహించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షమ శాఖ అధికారి విజయేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం, కలెక్టరేట్ కాంప్లెక్స్ నల్లగొండలో ఈ నెల 29లోగా సమర్పించాలని పేర్కొన్నారు. మాక్ టెస్టు డిసెంబర్ 2, 3, 9, 10 తేదీల్లో ఉదయం 10:30 నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నల్లగొండలో నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు 94943 45471, 79811 96060 నంబర్లను సంప్రదించాలని కోరారు.
యాదగిరిక్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారి జోడు సేవను ఆలయ మాడవీధిలో ఊరేగించారు.
Comments
Please login to add a commentAdd a comment