కేతేపల్లి : కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్థాపంతో ఓ వ్యవసాయ కూలీ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండంలోని తుంగతుర్తి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తుంగతుర్తి గ్రామానికి చెందిన ఉప్పుల మల్లయ్య(45) వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మల్లయ్య తన కూతురు వివాహంతో పాటు, కుటుంబ అవసరాల కోసం గ్రామంలో తెలిసిన వారి దగ్గర అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీరేమార్గం లేకపోవడంతో మనస్థాపం చెందిన శనివారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు మల్లయ్యను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. మల్లయ్యకు భార్య, వివాహమైన కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ శివతేజ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment