మునుగోడు: ఇసుక వాగులోని నీటి కుంటలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన సంఘటన మునుగోడు మండలంలోని చొల్లేడు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మునుగోడు పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చొల్లేడు గ్రామానికి చెందిన దోటి సత్తయ్య (31) అనే మతిస్థిమితం లేని వ్యక్తి తమ ఇంటి నుంచి అప్పుడప్పుడు బయటకు వెళ్లి రెండుమూడు రోజులకు తిరిగి వచ్చేవాడు. అదే తరహాలో ఈ నెల 21వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన సత్తయ్య తిరిగి రాలేదు. ఎప్పటిలాగే రెండు రోజుల తరువాత వస్తాడని కుటుంబ సభ్యులు భావించారు. కాగా సత్తయ్య మృతదేహం ఆదివారం ఆ గ్రామ వాగులోని ఓ నీటి కుంటలో కనిపించిందని గ్రామానికి చెందిన వంగూరి శంకరయ్య అనే వ్యక్తి బాధిత కుటుంబ సభ్యులకు తెలియజేశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సత్తయ్య మృతదేహాన్ని పరిశీలించి బయటకు తీశారు. సత్తయ్య మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ రవి తెలిపారు. సత్తయ్య కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment