మఠంపల్లి : పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను 108వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆదివారం ఆడబిడ్డకు జన్మనించింది. 108సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోజ్యాతండాకు చెందిన గర్భిణి అజ్మీరా రోజా పురిటినొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. దీంతో మహిళను వాహనంలో హుజూర్నగర్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలిస్తుండగా పెదవీడు వద్దకు చేరుకోగానే నొప్పులు ఎక్కువై 108సిబ్బంది సహాయంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇరువురిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండడంతో కాన్పు చేసిన 108సిబ్బందిని పలువురు అభినందించారు.
బావిలో మునిగి వ్యక్తి మృతి
వేములపల్లి : బావిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని లక్ష్మీదేవిగూడెం గ్రామంలో ఆది వారం చోటు చేసుకుంది. స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆమ నగల్లు గ్రామానికి చెందిన బంటు సైదులు(37) ఆదివారం మధ్యాహ్నం లక్ష్మీదేవిగూడెం గ్రామశివారులోని తనపొలం వద్దకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో లక్ష్మీదేవిగూడెం గ్రామ పరిధిలోని చలిచీమలపాలెం గ్రామానికి చెందిన చెన్నబోయిన విఠల్ తన వ్యవసాయ బావిలో మోటార్ ఇరుక్కుందని, తీసేందుకు రావాలని సైదులును తీసుకెళ్లాడు. విఠల్ ఒడ్డున ఉండగా సైదులు బావిలోకి దిగి మోటార్ తీసేందుకు వెళ్లి ఎంతకు పైకి రాలేదు. దీంతో విఠల్ స్థానికులకు సమాచారం అందించగా స్థానికులు అక్కడకు చేరుకోని పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ నరసింహారావు అక్కడికి చేరుకుని ఈతగాళ్లతో బావిలో గాలించి సైదులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా మృతుడికి భార్య సుజాత, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విషయమై ఇప్పటి వరకు పోలీస్స్టేషన్లో ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు వెల్లడించారు.
విద్యుత్ స్తంభం పైనుంచి
పడి వ్యక్తి దుర్మరణ ర
పెన్పహాడ్ : ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం పైనుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఒగ్గు భిక్షం(40) అదే గ్రామానికి చెందిన దండెంపల్లి సుధాకర్ వ్యవసాయ క్షేత్రంలో స్తంభంపై విద్యుత్ తీగలు తీసేందుకు భిక్షంను కూలీ పనులకు తీసుకెళ్లాడు. విద్యుత్ తీగలను లాగుతున్న క్రమంలో స్తంభం పైన ఉన్న భిక్షం తాడు సహాయంతో విద్యుత్ తీగను అందుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారీ కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయమై ఎస్ఐ గోపికృష్ణను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
ఉరివేసుకొని
మహిళ ఆత్మహత్య
నకిరేకల్ : ఉరివేసుకొని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కడపర్తి గ్రామానికి చెందిన పందిరి నాగమ్మ(38) భర్త కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో పట్టణంలోని ఎస్ఎల్బీసీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. నాగమ్మ మానసిక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ అద్దె ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడు సూరారం భద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment