ఎనిమిది లెప్రసీ కేసులు
నల్లగొండ టౌన్: జిల్లా వ్యాప్తంగా ఎనిమిది కుష్టువ్యాధి (లెప్రసీ) కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 2 నుంచి 15వ తేదీ వరకు వైద్య ఆరోగ్యశాఖ లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్(ఎల్‌సీడీసీ) సర్వే నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా 1,466 మంది సిబ్బంది మొత్తం 1,49,179 ఇళ్లను సందర్శించి 5,47,892 మందిని పరీక్షించారు. ప్రతిఒక్కరి శరీరంపై ఉన్న తెల్ల, నల్ల, గోధుమ రంగు మచ్చలు, స్పర్శలు లేని మచ్చలను పరీశీలించారు. అందులో 151 మందికి లెప్రసీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ పూర్తి స్థాయిలో లెప్రసీ పరీక్షలను నిర్వహించగా ఎనిమిది మందికి కుష్టువ్యాధి ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది.
బాధితులకు చికిత్స ఇలా..
జిల్లాలో ఇప్పటికే 94 మంది కుష్టువ్యాధి బాధితులు బహుళ ఔషధ పద్ధతిన (మల్టీ డ్రగ్ థెరపీ–ఎండీటీ) చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం గుర్తించిన 8 మందితో కలిపి జిల్లాలో మొత్తం 102 మంది కుష్టు బాధితులకు నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోఉన్న కుష్టువ్యాధి విభాగంలో ఎండీటీ ప్రారంభించారు. అయితే కుష్టువ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించవచ్చనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి ఎల్‌సీడీసీ సర్వే ద్వారా కుష్టు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వ్యాధి నిర్ధారణ అయిన వారికి మల్టీడ్రగ్ థెరపీ చికిత్స అందిస్తూ వస్తోంది. దీంతో అప్పటి నుంచి జిల్లాలో కుష్టు కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. రానున్న రోజుల్లో కుష్టువ్యాధి రహిత జిల్లాగా మార్చాలన్న సంకల్పంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ముందుకు సాగుతోంది.
ఇటీవల సర్వేలో 151 మంది అనుమానితుల గుర్తింపు
ఫ వారందరికీ పరీక్షలు చేసినవైద్య ఆరోగ్య శాఖ
ఫ జిల్లాలో 102కు చేరిన కుష్టు బాధితులు
ఇవీ.. కుష్టు లక్షణాలు
కుష్టు వ్యాధి అనేది మైక్రోబ్యార్టీరియం లెప్రో అనే బ్యాక్టీరియా వల్ల కలిగే దీర్ఘకాలిక వ్యాధి. ఇది ప్రధానంగా ఏ వయసు వారికై నా సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి.. నరాలు, చర్మం, ముక్కు ద్వారం ఎగువ శ్వాసనాళాలపై ప్రభావం చూపుతుంది. చర్మంపై ఎర్రని, గోధుమ రంగు (పాలిపోయిన, స్పర్శ లేకపోవడం వంటి మచ్చలు ఉంటే) కుష్టవ్యాధి లక్షణాలుగా గుర్తించాలి.
చికిత్స చేయించుకోవాలి
ఈ ఏడాది చేపట్టిన సర్వేలో కేవలం ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. లక్షణాలున్న వారు లెప్రసీ సెంటర్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స పొందాలి.
– డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment