ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కల్పించాలి
ఫ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కంచుకట్ల సుభాష్
మర్రిగూడ: ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేసి డిండి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించి జిల్లాలో ఫ్లోరోసిస్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కంచుకట్ల సుభాష్ అన్నారు. గురువారం ఆయన మర్రిగూడ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు కృష్ణా జలాలు అందించాలన్నారు. ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను గుర్తించి సదరం సర్టిఫికెట్ అందించాలన్నారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కోరారు. 30శాతం వైకల్యం ఉన్న ఫ్లోరోసిస్ బాధితులకు నెలకు రూ.15వేల పింఛన్లు అందించడంతోపాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. శివన్నగూడెం, కిష్టరాయనపల్లి ప్రాజెక్టుల భూనిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కబడ్డీ బాలుర జూనియర్ జట్టు ఎంపిక
హాలియా: అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కబడ్డీ జిల్లా బాలుర జూనియర్ జట్టును ఎంపిక చేసినట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.భూలోకరావు, జి.కర్తయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కెప్టెన్‌గా పి.భరత్ (గర్నెకుంట), సీహెచ్.గణేష్ (మిర్యాలగూడ), ఎం.గిరి (గుడిపల్లి), పి.రాజు (పాల్తీతండా), ఎస్.శ్రీపాదం (పెద్దగట్టు), డి.మధు (అనుముల), జి.వేణు (ఇబ్రహీంపేట), కె.రాకేష్ (మధారిగూడెం), సీహెచ్.హన్మంతు (వెల్మగూడెం), ఆర్.శివ (కోదండపురం), కె.అనిల్ (వెల్మగూడెం), ఎన్.వెంకటేష్ (తుంగతుర్తి), ఎస్‌కె.వహీద్ (తడకమళ్ల) ఎన్నికయ్యారని తెలిపారు. కోచ్‌గా కె.సైదులు (చిల్కాపురం), మేనేజర్‌గా పి.సత్యనారాయణ వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు జనగాంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు పాల్గొంటుందని తెలిపారు.
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
సూర్యాపేటటౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సరెండర్ బిల్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, జీపీఎఫ్ రుణాలు, పార్ట్ ఫైనల్స్, పెన్షనర్ల రిటైర్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈనెల 28 నుంచి 30 వరకు నల్లగొండలో జరిగే యూటీఎఫ్ ఆరవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ యాకయ్య, జిల్లా ఉపాధ్యక్షులు అరుణ భారతి, జిల్లా కోశాధికారి వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు నాగేశ్వరరావు, ఆడం, రమేష్, లాలు, పాండురంగాచారి, రవీందర్, సాంబయ్య, శ్రీనివాస చారి పాల్గొన్నారు.
నృసింహుడికి లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజను ఆగమశాస్త్రానుసారంగా వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభూలకు అర్చకులు పంచామృతాలతో నిజాభిషేకం చేసి, తులసి దళాలతో సహస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి బంగారు సింహాసనంపై అధిష్టింపజేసి వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా గోదాదేవికి అర్చకులు ప్రత్యేక పాశురం పఠించారు.
Comments
Please login to add a commentAdd a comment