‘ముసురు’కున్న నీలగిరి
నల్లగొండ టూటౌన్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బుధవారం పొద్దస్తమానం నీలగిరి పట్టణంలో ముసురు పట్టింది. మంగళవారం రాత్రి నుంచే చిరుజల్లులతో ముసురుకుంది. ఒకవైపు ముసురు.. మరో వైపు చలి తీవ్రతతో పట్టణ ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. క్రిస్మస్ కావడంతో పట్టణంలోని రోడ్లపై జన సందడిగా మోస్తరుగా కనిపించింది.
నేడు యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్ర పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ భాస్కర్‌రావు తెలిపారు. వేకువజామున 5గంటలకు వైకుంఠద్వారం నుంచి గిరిప్రదక్షిణ ఉంటుందని, అదే విధంగా కొండపైన స్వాతి హోమం, శత ఘటాభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన మండపాల్లో యాద రుషి, ప్రహ్లాదుడి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడకల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొంటారని వివరించారు.
గోదాదేవికి తిరునక్షత్ర మంగళహారతి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. 10వ రోజు బుధవారం ఉదయం గోదాదేవిని పట్టువస్త్రాలు, బండారు ఆభరణాలతో అలంకరించి పాశురాలు పఠించారు. అనంతరం అమ్మవారికి మహిళలు మంగళ హారతులతో నీరాజనం పలికారు.
సంప్రదాయ పూజలు
ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ముఖ మండపం, ప్రాకార మండపంలో అష్టోత్తరం, సుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు చేపట్టారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవారికి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు శారాజీపేట విద్యార్థులు
ఆలేరురూరల్ : ఆలేరు మండలం శారాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం జ్యోతి, ఫిజికల్ డైరక్టర్ గడసంతల మధుసూదన్ తెలిపారు. భువనగిరిలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఖోఖోలో అలకుంట్ల వైష్ణవి, దూడల తేజస్వి, కబడ్డీ విభాగంలో వస్పరి జాగృతి ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. వరంగల్‌లో ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు. విద్యార్థులను హెచ్‌ఎం జ్యోతి, ఫిజికల్ డైరెక్టర్ మధుసూదన్, ఉపాధ్యాయులు రాజేశ్వర్‌రావు, సంజీవరెడ్డి, రామచందర్, కాంతారావు, శ్రీనివాస్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment