నేతన్నకు అభయహస్తం
భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట: నేతన్నకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి కానుకగా రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధి కొరకు రూ.168 కోట్లతో తెలంగాణ నేతన్న పొదుపు, తెలంగాణ నేతన్న భద్రత, తెలంగాణ నేతన్న భరోసా పథకాల అమలుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ పథకాలను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నేతన్న పొదుపు నిధికి రూ.115కోట్లు, నేతన్న భద్రత కొరకు రూ.9కోట్లు, నేతన్న భరోసాకు రూ.44 కోట్లు కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ జీఓ నంబర్ 3 జారీ చేశారు. చేనేత కార్మికుల నుంచి క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను తీసుకొని అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం చేనేత అభయహస్తం పథకానికి రూపకల్పన చేసింది.
తెలంగాణ నేతన్న పొదుపు (త్రిఫ్ట్)
తెలంగాణ నేతన్న పొదుపు పథకాన్ని(త్రిఫ్ట్) యథావిధిగా అమలు చేస్తుంది. ఈ పథకం గతంలో కరోనా కష్టకాలంలో చేనేత కార్మికులను ఆదుకుంది. జియో ట్యాగింగ్ కల్గి మగ్గం నేస్తున్న కార్మికుడితో పాటు అనుబంధ కార్మికులు తాము చేస్తున్న వృత్తి నుంచి వచ్చే వేతనాన్ని 8శాతం ఆర్‌డీ–1 అకౌంట్‌లో పొదుపు చేస్తే, ప్రభుత్వం తమ వాటా కింద రెండింతలు అనగా 16శాతం ఆర్‌డీ–2 అకౌంట్‌లో జమ చేస్తుంది. అలాగే పవర్‌లూమ్ కార్మికులు తమ వేతనం నుంచి 8శాతం పొదుపు చేస్తే అంతే మొత్తంలో (8శాతం) ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మగ్గాలపై ఆధారపడి ఉన్న 25వేల మంది చేనేత కార్మికులకు, అదేవిధంగా మరమగ్గాలపై ఆధారపడిన 6వేల మంది పవర్‌లూమ్ కార్మికులకు కూడా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం రికరింగ్ డిపాజిట్ కాలాన్ని 3 నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. అంటే కార్మికులు తమ పొదుపు చేసిన డబ్బులను రెండేళ్ల తర్వాత తమ అవసరాలకు డ్రా చేసుకొనే వీలు ఉంటుంది.
తెలంగాణ నేతన్న భద్రత (నేతన్న బీమా)
జియో ట్యాగింగ్ కల్గిన చేనేత, మరమగ్గాలపై పనిచేసే కార్మికులతో పాటు అనుబంధ కార్మికులందరికీ నేతన్న భద్రత పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద నమోదైన కార్మికుడు ఏ కారణం చేతనైనా మృతిచెందినా ఆ కుటుంబంలోని నామినీకి రూ.5లక్షల బీమా మొత్తాన్ని అందజేస్తారు. కాగా గతంలో 59 ఏళ్లు ఉన్న చేనేత కార్మికులకే ఈ బీమా పథకం వర్తించేది. కానీ రేవంత్‌రెడ్డి సర్కార్ వయోపరిమితి నిబంధనలను ఎత్తివేసి చేనేత వృత్తిపై ఆధారపడి పనిచేస్తున్న వారందరికి బీమా కవరేజీ అందజేస్తుంది.
తెలంగాణ నేతన్నకు భరోసా
చేనేత కార్మికులకు వేతన ప్రోత్సాహకం అందించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే జియో ట్యాగింగ్ కల్గి, ప్రభుత్వం అందజేసిన హ్యాండ్లూమ్ మార్క్ లోగోలతో తమ వస్త్రోత్పత్తులను విక్రయించే కార్మికులకు వారి ఉత్పత్తి ప్రమాణాల ఆధారంగా ఏడాదికి గరిష్టంగా రూ.18వేలు, అనుబంధ కార్మికుడికి రూ.6వేలు అందజేయనుంది. ఫలితంగా నేత కార్మికుడికి వేతన మద్దతు లభిస్తుండటంతో వస్త్రాల నాణ్యత కూడా పెంపొందుతుంది. ఈ పథకం అమలుకు ప్రభుత్వం వార్షిక బడ్జెట్ అంచనా రూ.44 కోట్లు కేటాయించింది.
ఎంతో సంతోషంగా ఉంది
కాంగ్రెస్ ప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. పోచంపల్లిలో అధికంగా ఉన్న చేనేత కార్మికులకు మేలు చేకూరుతుంది. త్రిఫ్ట్ పథకం మెచ్యూరిటీ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– అంకం పాండు, చేనేత కార్మిక సంఘం
అధ్యక్షుడు, భూదాన్‌పోచంపల్లి
హ్యాండ్లూమ్ మార్క్ లేబుల్స్..
అలాగే తెలంగాణలోని చేనేత వస్త్రాల ఘన వారసత్వాన్ని, సంప్రదాయ ప్రతిష్టను పెంచడం, దేశ, అంతర్జాతీయ మార్కెట్ లో ప్రత్యేక గుర్తింపు, సముచితమైన మార్కెటింగ్‌ను సృష్టించడానికి ప్రభుత్వం హ్యాండ్లూమ్ మార్క్ లేబుల్‌ను రూపొందించింది. దాంతో కొనుగోలుదారుడికి కూడా ప్రామాణికత, నాణ్యతపరమైన హామీ అందుతుంది. తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్ లేబుళ్లకు ప్రభుత్వం వార్షిక బడ్జెట్ కూ. 4 కోట్లు కేటాయించింది.
చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధి కోసం మూడు పథకాలు అమలు
రూ.168 కోట్లు కేటాయించిన
రాష్ట్ర ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment