ఉద్యోగం వదిలి.. ఉపాధి కల్పించే స్థాయికి..
భూదాన్‌పోచంపల్లి : ఎంటెక్ పూర్తి చేసి ఆరేళ్లపాటు ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసిన యువకుడు.. వారి కుల వృత్తిపై మమకారంతో హ్యాండ్లూమ్ యూనిట్‌ను నెలకొల్పి ఆదర్శంగా నిలుస్తున్నాడు. భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన సాయిని భరత్ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చేస్తున్న చేనేత వృత్తిని చూస్తూ పెరిగాడు. ఆ వృత్తిని పదికాలాల పాటు సజీవంగా ఉంచాలని భావించి.. అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి కేంద్ర ప్రభుత్వ చిన్న, లఘు, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కళా పునర్వి పేరిట హ్యాండ్లూమ్ యూనిట్‌ను నెలకొల్పాడు. దారం నుంచి వస్త్రం వరకు ఇక్కడే తయారవుతాయి. ఈ యూనిట్‌లో 100 మందికి ఉపాధి పొందుతున్నారు. దేశ, విదేశాలకు చెందిన పలువురు అధికారులు, సంస్థలు ఇతని యూనిట్‌ను సందర్శించి అభినందిస్తున్నారు.
నిత్య ప్రయోగశీలి..
ఎంటెక్ చేసిన సాయిని భరత్ నిత్య ప్రయోగశీలి. చేనేతలో నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్నాడు. కస్టమర్ల ఆర్డర్‌పై ఎలాంటి డిజైన్ అయిన కంప్యూటర్‌లో రూపొందించి దానిని వస్త్రంపై ఆవిష్కరిస్తున్నాడు. అంతేకాక నాణ్యతమైన వస్త్రాలను రూపొందిస్తూ, దేశంలోని ప్రధాన నగరాలు, షోరూమ్‌లతో పాటు ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియాద్వారా విదేశాలకు సొంతంగా మార్కెటింగ్ చేస్తూ తనకంటూ ఇమేజ్‌ని సంపాదించాడు.
Comments
Please login to add a commentAdd a comment