విజ్ఞానాన్ని పంచుతూ..
గ్రంథాలయంలో పుస్తకాలు, పేపర్ చదువుతున్న పాఠకులు (ఫైల్)
చిట్యాల : విజ్ఞానాన్ని పంచేవి గ్రంథాలయాలు. అలాంటి విజ్ఞాన బాండాగారాలను గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పాలనే లక్ష్యంతో ముందుకు సాగాడు ఓ యువకుడు. స్నేహితులు, గ్రామస్తుల సహకారంతో తమ గ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా 19 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. ఇదే స్ఫూర్తితో ఇతర గ్రామాల్లోనూ గ్రంథాలయాల ఏర్పాటుకు సహకరిస్తున్నాడు చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన అనుముల శ్రీనివాస్. ఆయన సేవలకుగాను గతేడాది మార్చిలో పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తీ పురస్కారానికి అందజేసింది. దీంతోపాటు పలు అవార్డులు సైతం పొందాడు.
స్వగ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు
వృత్తి రిత్యా లైబ్రేరియన్ అయిన అనుముల శ్రీనివాస్ గుండ్రాంపల్లి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటుకు తనతో పాటు గ్రామంలో చదువుకుని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారి నుంచి ఆర్థిక వనరులు సమకూర్చాడు. గ్రామ పెద్దల సహకారంతో భవనాన్ని ఏర్పాటు చేశాడు. 2006 ఏప్రిల్ 14న విద్యావేత్త చుక్క రామయ్య చేతుల మీదుగా గ్రంథాలయాన్ని ప్రారంభింపజేశాడు. గ్రంథాలయంలో అన్ని దిన, వార పత్రికలు, పోటీ పరీక్షల పుస్తకాలను సమకూర్చాడు. ఇక్కడి గ్రంథాలయంలో చదువుకున్న 30 మంది యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు.
విపంచి ఫౌండేషన్ ఏర్పాటు
శ్రీనివాస్ తన స్నేహితులతో కలసి క్రీడా పోటీలు, కెరీర్ గైడెన్స్ సమావేశాలు, డెంటల్ ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వేసవిలో విద్యార్థులకు చిత్రలేఖనం, చెస్, క్యారమ్స్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. 2021లో విపంచి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలకు వేలాది పుస్తకాలు, ఫర్నిచర్ అందజేస్తున్నాడు. ఇప్పటి వరకు నల్లగొండ, కరీంనగర్, కడప జిల్లాలోని పది వరకు గ్రంథాలయాల ఏర్పాటుకు సహకారం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment