చేనేత రంగంలో కొత్త యంత్రం..
యాదగిరిగుట్ట : చేనేత రంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు ఆ యువ నేతకార్మికుడు నూతన యంత్రాన్ని కనుగొన్నాడు. ఆ యంత్రంతో కార్మికుడికి శ్రమను తగ్గించి.. సమయాన్ని ఆదా చేయడమే కాకుండా.. చేనేత రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ల వచ్చునని చాటి చెప్పాడు. ఆయనే ఆలేరుకు చెందిన చింతకింది నరేందర్. 2013లో తనకు వచ్చిన ఆలోచనతో 12 ఏళ్లు కష్టపడి చేనేత వస్త్రాల తయారీలో అనుకున్న డిజైన్ రావాలంటే, ఆసుపై డిజైన్ మార్కింగ్‌లో ఉన్న మిషన్‌ను తయారు చేశాడు. పలు ఆటుపోట్లు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికి.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు.
కంప్యూటర్‌లోనే డిజైన్..
గతంలో ఒక చీరపై ఏదైనా డిజైన్ రావాలంటే చేనేత కార్మికులు కూర్చోని, గంటల తరబడి డిజైన్‌ను తయారు చేసే వారు. కార్మికుడు సుమారు 7 నుంచి 8 గంటల వరకు ఒకే దగ్గర కూర్చుని, కిందికి దించిన తలను పైకి ఎత్తకుండా ఏకగ్రతతో డిజైన్ వేస్తూ పని చేస్తాడు. ఆ తరువాతనే కట్టు కట్టడం, రబ్బర్లు చుట్టడం, రంగులు అద్దడం, కండెలు పోయడం, మగ్గంపై నిలువు, పేక ఒక్క పోగు అల్లుతూ నేయడం చేస్తే చేనేత కార్మికుడు అనుకున్న డిజైన్‌తో ఏదైనా వస్త్రం తయారు అవుతుంది. దీంతో చాలా మంది నేతకార్మికులు మెడ, కంటి నరాలు దెబ్బతినడం, అనారోగ్యానికి గురవుతారు. దీన్ని గమనించిన నరేందర్ కంప్యూటర్ ద్వారా చేనేత కార్మికుడు అనుకున్న డిజైన్‌ను తయారు చేసుకొని, అందులో ఉన్న డిజైన్ పెన్ డ్రైవ్, మెమోరీ కార్డుల్లో వేసుకొని వస్త్రంపై వచ్చేలా ఆసుపై డిజైన్ మార్కింగ్ వచ్చే యంత్రాన్ని రూపొందించాడు. గ్రాఫ్ కాగితం చేనేత కార్మికుడు కూర్చోని డిజైన్ తయారు చేయడానికి సుమారు 7 నుంచి 8గంటల సమయం పడితే.. ఆసుపై డిజైన్ మార్కింగ్ యంత్రంతో సుమారు 2 నుంచి 3గంటల్లో పూర్తవుతుంది. ఈ యంత్రం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు నేతకార్మికులు ఆరోగ్యంగా ఉంటూ.. అనుకున్న డిజైన్‌ను తయారు చేసి వస్త్రంపై రూపొందించుకునేలా వీలు కలుగుతుంది.
తక్కువ ఖర్చుతోనే..
కంప్యూటర్ ద్వారా డిజైన్ రూపొందించేందుకు తక్కువ సమయంతో పాటు కరెంట్ బిల్లు సైతం తక్కువగా వస్తుంది. ప్రస్తుతం నరేందర్ తయారు చేసిన ఈ యంత్రాన్ని పుట్టపాకకు చెందిన ఎస్.వెంకటేశం అనే చేనేత కార్మికుడికి అందజేశాడు. యంత్రం సాయంతో ఆయన కంప్యూటర్‌లో డిజైన్లు చేసి, చీరెలపై వేస్తున్నాడు. మిషన్‌కు ధర నిర్ణయించలేదు. ఈ మిషన్ ఇప్పుడు తయారు చేస్తే సుమారు రూ.50 వేలు ఖర్చు ఉంటుందని నరేందర్ చెబుతున్నాడు.
ఆసు డిజైనింగ్ మిషన్
కంప్యూటర్‌లో డిజైన్..
ఆసు మిషన్‌కు పెన్ డ్రైవ్..
నూతన మిషన్‌ను తయారు చేసిన
ఆలేరు చేనేత కళాకారుడు నరేందర్
Comments
Please login to add a commentAdd a comment