అమరవరపు సతీష్‌కు అరుదైన అవకాశం
గరిడేపల్లి: మండల పరిధి లోని అప్పన్నపేట గ్రామానికి చెందిన డప్పు కళా కారుడు అమరవరపు సతీష్‌కు ఈ నెల 26న ఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ అవకాశం రావడం సతీష్‌కి ఇది రెండోసారి కావడం విశేషం. తనకు గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించిన బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అందె భాస్కర్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, భారత సంగీత నాటక అకాడమీకి, ప్రధాని నరేంద్ర మోదీకి సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. సతీష్‌ను పలువురు అభినందించారు.
యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
త్రిపురారం: త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ డిప్లొమా, వ్యవసాయ డిగ్రీ లేదా వ్యవసాయ పీజీలో ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి కలవారు పూర్తి వివరాలతో ఈ నెల 15వ తేదీన ఉదయం 10:30 గంటలకు కేవీకేలో జరిగే మౌఖిక పరీక్షకు హాజరుకావాలని సూచించారు.
పరీక్షా పే చర్చ
పోటీలకు ఎంపిక
గుర్రంపోడు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను జాతీయస్థాయిలో జరిగే ఎంపిక పోటీలకు గుర్రంపోడు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పి. అంజలి ఎంపికై ంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎంపిక కాగా అందులో అంజలి ఒకరు కాగా.. మరొకరు మంచిర్యాల జిల్లాకు చెందిన వారు. ఈ నెల 15న ఢిల్లీలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులతో జరిగే పోటీలో ప్రతిభ కనబర్చితే ప్రధానమంత్రితో పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అంజలికి దక్కుతుంది. అంజలితో పాటు గైడ్ శీతల్(సోషల్ టీచర్)ను ఢిల్లీకి వెళ్లనున్నారు. అంజలిని ప్రిన్సిపాల్ జి. రాగిణి, గైడ్ శీతల్, అధ్యాపక బృందం అభినందించారు.
గాలిపటం ఎగరేస్తుండగా విద్యుదాఘాతం
● బాలుడికి తీవ్ర గాయాలు,
పరిస్థితి విషమం
చౌటుప్పల్ రూరల్: సంక్రాంతి పండుగ పూట విషాదం నెలకొంది. ఇంటి మేడపై గాలిపటం ఎగరవేస్తున్న ఓ బాలుడు విద్యుదాఘానికి గురైయ్యాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లంబావి గ్రామానికి చెందిన జెల్ల మధు పెద్ద కుమారుడు దీక్షిత్(10) శనివారం గాలిపటం ఎగురవేయడానికి ఇంటి పైకి ఎక్కాడు. గాలిపటం ఇంటి పక్కనే ఉన్న 11కేవీ కరెంట్ స్తంభానికి చిక్కుకుంది. దీంతో దీక్షిత్ స్టీల్ రాడ్‌తో గాలిపటం తీసే ప్రయత్నం చేశాడు. స్టీల్ రాడ్డుకు కరెంట్ తీగకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్టీల్ రాడ్డు దీక్షిత్ కడుపునకు అనుకుని ఉండడంతో అది అతడి పొట్టలోకి దిగింది. కుడి కాలి వేళ్లు సైతం కాలిపోయాయి. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment