హైవేలపై బారులు తీరిన వాహనాలు
చౌటుప్పల్, చౌటుప్పల్ రూరల్, కేతేపల్లి, కోదాడరూరల్, బీబీనగర్: సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వెళ్లేవారి వాహనాలతో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం రద్దీ కొనసాగింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ స్వస్థలాలకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి చౌటుప్పల్‌కు చేరుకునేందుకు మూడు గంటల సమయం పడుతుందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాలలో జంక్షన్‌ల వద్ద రోడ్డును దాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చౌటుప్పల్ పట్టణంలో వాహనాల రద్దీని శనివారం రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డి పర్యవేక్షించారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాలను 11 కౌంటర్లు ఓపెన్ చేసి పంపిస్తున్నారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద శనివారం తెల్లవారుజాము నుంచి రాత్రి 10గంటల వరకు సుమారు 95వేల వాహనాలు ప్రయాణం కొనసాగించాయి. ఫాస్టాగ్ లేని వాహనాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నగదు కౌంటర్ ద్వారా పంపిస్తున్నారు. టోల్‌ప్లాజా రోడ్డు ప్రారంభమైన దండుమల్కాపురం నుంచి పంతంగి టోల్‌ప్లాజా వరకు ఉన్న బ్లాక్ స్పాట్ల వద్ద పోలీసు సిబ్బంది ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భువనగిరి డీసీపీ రాజేష్‌చంద్ర, ట్రాఫిక్ డీసీపీ సుర్కంటి మల్లారెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. పంతంగి టోల్‌ప్లాజాను సందర్శించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా తీసుకున్న చర్యల గురించి టోల్‌ప్లాజా నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. చౌటుప్పల్ ఏసీపీ పి. మధుసూదన్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి, సీఐ మన్మథకుమార్ వాహనాదారులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
కొర్లపహాడ్ టోల్‌ప్లాజా నుంచి 55వేల వాహనాలు..
అదేవిధంగా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా నుంచి సాధారణ రోజుల్లో 18 నుంచి 20వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా శనివారం ఒక్కరోజే దాదాపు 55వేల వాహనాలు వెళ్లినట్లు టోల్ నిర్వాహకులు పేర్కొన్నారు. వాహనాల రద్దీకి అనుగుణంగా కొర్లపహాడ్ టోల్‌ప్లాజాలోని 12 కౌంటర్లలో ఎనిమిది కౌంటర్లను విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు కేటాయించారు. భారీగా వస్తున్న వాహనాలను క్లియర్ చేసేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రత్యేక సిబ్బందిని టోల్ ఏజెన్సీ నిర్వాహకులు నియమించారు. అదేవిధంగా కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మునగాల మండలం మాదారం నుంచి రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్ వరకు ఆరుగురు ఎస్‌ఐలు, 18 మంది సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పాలేరు వంతెన సమీపంలోని రామాపురం క్రాస్‌రోడ్‌లో వాహనదారులు వేగంగా వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
కట్టకమ్ముగూడెం క్రాస్‌రోడ్ మూసివేత...
కోదాడ పట్టణ పరిధిలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కట్టకమ్ముగూడెం క్రాస్‌రోడ్‌ను మూసివేశారు. ఈ క్రాసింగ్ నుంచి చిలుకూరు మండలంలోని దాదాపు ఏడు గ్రామాల ప్రజలు రాకపోకలు కొనసాగిస్తుంటారు. దానిని బ్లాక్ స్పాట్‌గా గుర్తించిన అధికారులు విజయవాడ వైపు వాహనాలు ఎక్కువగా వెళ్తుండడంతో వాహనాలు రాకపోకలు సాగించకుండా మూసివేశారు. భారీ వాహనాలను హుజూర్‌నగర్ ఫ్లైఓవర్ కింద నుంచి, ద్విచక్ర వాహనాలను కట్టకమ్ముగూడెం అండర్‌పాస్ కింద నుంచి మళ్లించారు.
గూడూరు టోల్‌ప్లాజా వద్ద..
బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద శనివారం మధ్యాహ్నం నుంచి వాహనాలు బారులుదీరాయి. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు సాయంత్రం సుమారు కిలోమీటర్‌కు పైగా ట్రాఫిక్ నెలకొంది.
హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ చేరుకునేందుకు మూడుగంటలు
టోల్‌ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాం
Comments
Please login to add a commentAdd a comment