పంటల సాగులో ఎరువుల వాడకమే కీలకం
ఏ దశలో ఎరువులు వాడాలంటే..
పంటలకు నత్రజని అవసరం చివరి దశ వరకు ఉంటుంది. నత్రజని ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో రెండు మూడు కీలక దశల్లో వాడుకోవాలి. ఏపుగా పెరిగేందుకు, పూత, మొగ్గ దశ, పంట దిగుబడి పెరిగే దశల్లో ప్రధానంగా వాడుకోవాలి. నత్రజనిని యూరియా రూపంలో వాడే సమయంలో వృథాని అరికట్టడానికి పైన చెప్పిన మిశ్రమాలను ఉపయోగించాలి. భాస్వరం ఎరువును మొత్తం మోతాదును విత్తే సమయంలో చివరి దుక్కిలో వేసుకోవాలి. దీంతో ఎరువు భూమిలో నిల్వ ఉండి కొద్దికొద్దిగా పంటకు అందుతుంది. పొటాష్ ఎరువులు మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు నాణ్యత కలిగిన ఉత్పత్తి వచ్చేలా చేస్తాయి.
పెద్దవూర: పంటల సాగులో ఎరువుల వాడకం కీలకమని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్‌కుమార్ తెలిపారు. ఎరువుల వినియోగానికి సంబంధించి రైతులు పాటించాల్సిన పద్ధతులు ఆయన మాటల్లోనే..
సేంద్రియ ఎరువులతో ఎంతో మేలు..
సేంద్రియ ఎరువుల వాడకం మూలంగా అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సొంతంగా వాటిని తయారు చేసుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గుతాయి. పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్ మడ్డి, పచ్చిరొట్ట ఎరువులు, వ్యవసాయ వ్యర్థ పదార్థాల వాడకం, జీవన ఎరువుల వాడకం ప్రాధాన్యతను గుర్తించాలి.
రసాయనిక ఎరువులతో నష్టం..
రసాయనిక ఎరువుల వాడకం వల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా భూసారంలో మార్పులు సంభవిస్తాయి. మరోవైపు పంట ఉత్పత్తుల్లో రసాయనిక అవశేషాలు మిగిలి ఉండి మార్కెట్లో దాని ప్రభావంతో డిమాండ్ తగ్గి ధరలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. రసాయనిక ఎరువులు వాడడం తగ్గించాలి. వీటి వాడకం వల్ల క్రమేపీ పంట దిగుబడులు కూడా తగ్గుతాయి.
ఎరువుల వాడకంలో పాటించాల్సిన పద్ధతులు..
ఫ లోతు దుక్కుల వల్ల భూమి పొరలు గుల్లబారి తేమను బాగా నిల్వ ఉంచుకుంటాయి. వేసిన ఎరువును ఎక్కువ శాతం మొక్కలు తీసుకుంటాయి.
ఫ పంటలో ఉన్న కలుపును పూర్తిగా తొలగించిన అనంతరం తేమ ఉన్న దశలోనే ఎరువులు చల్లుకోవాలి.
ఫ అన్ని పోషకాల్లో నత్రజని పోషకం వృథా ఎక్కువగా ఉంటుంది. యూరియాను వేప పిండితో కలిపిగానీ, వేప నూనె కలుపుకుని వాడితే నత్రజని నెమ్మదిగా విడుదలవుతూ వృథా తగ్గుతుంది.
ఫ కోల్‌థార్‌తో 2 లీటర్ల కిరోసిన్‌తో మిశ్రమం చేసి రెండు బస్తాల యూరియాలో కలిపితే మంచి ఫలితాలు వస్తాయి. అర బస్తా యూరియాను ఒక బస్తా తడి, పొడి మట్టితో కలిపి 24 గంటలు నీడలో ఉంచి ఆ తర్వాత నేలకు అందిస్తే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
వెదజల్లే పద్ధతి.. ప్రయోజనాలు
సాధారణంగా ఎరువులను రెండు పద్ధతుల్లో వేస్తుంటారు. వెదజల్లే పద్ధతిలో మొక్కలు దగ్గర దగ్గరగా ఉంటే మేలు జరుగుతుంది. వరుస క్రమంలో లేని మొక్కలకు, వేళ్లు భూమిలో అల్లుకుపోయే పైర్లకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. వరికి కూడా ఈ పద్ధతి మేలు చేస్తుంది.
పాదుల్లో ఎరువు వేసే పద్ధతి
మొక్కల దగ్గర ఎరువులు వేసే పద్ధతి ద్వారా పోషక వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వృథా కూడా తగ్గుతుంది. నిర్ణీత వరుసల్లో మొక్కలు ఉన్నప్పుడు పొలాన్ని 2 అంగుళాల మేర లోతు చేసుకుని తేమ ఉన్నప్పుడు మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు పడేలా వేయాలి. చిన్నపాటి గుంతలు తీసి ఎరువులు వేసిన సమయంలో దానిని మట్టితో కప్పేలా చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment