జూదరుల అరెస్ట్
చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామ శివారులో పేకాట శిబిరంపై మంగళవారం పోలీసులు దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.47వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మహిళ మెడలో
పుస్తెలతాడు చోరీ
భువనగిరిటౌన్: ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కోని పారిపోయారు. ఈ ఘటన మంగళవారం భవనగిరి పట్టణంలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామానికి చెందిన బాలోతు ధనమ్మ బీబీనగర్ మండలం భట్టుగూడెం గ్రామంలో నివాసముంటోంది. సోమవారం స్వగ్రామానికి వచ్చిన ధనమ్మ మంగళవారం భట్టుగూడేనికి తిరుగు ప్రయాణమయ్యింది. ఈ క్రమంలో ఆమె భువనగిరి బస్టాండ్‌లో బస్సు దిగి పక్కనే ఉన్న టైలర్ షాపులో జాకెట్లు తీసుకునేందుకు వెళ్లగా.. ఆ దుకాణం మూసిఉండటంతో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ధనమ్మను బస్టాండ్ నుంచే అనుసరిస్తూ ఆమెతో మాటలు కలిపారు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే ధనమ్మ మెడలోని ఐదు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కోని పారిపోయారు. ధనమ్మ కేకలు వేస్తూ ఆగంతకుల వెంటపడినప్పటికీ వారు తప్పించుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ చోరీలో మొత్తం ఆరుగురు వ్యక్తులు పాలుపంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
రెండు ఇళ్లలో చోరీ
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణంలోని తారాకరాంనగర్‌లో మంగళవారం రెండు ఇళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తారాకరాంనగర్‌లో నివాసముంటున్న అడెపు రవి ఇంటి తాళాన్ని గుర్తుతెలియని వ్యక్తులుళం పగులగొట్టి రూ.20వేల నగదు, తులం బంగారం ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న మరో ఇంట్లో కూడా దొంగలు చొరబడి 10 తులాల వెండి ఆభరణాలు చోరీ చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి టౌన్ పోలీసులు తెలిపారు.
వృద్ధురాలు అదృశ్యం
నాగారం: మండల పరిధిలోని ఈటూరు గ్రామానికి చెందిన నంగనూరు సైదమ్మ(65) ఈ నెల 18వ తేదీ నుంచి కనిపించడంలేదని ఆమె కుమారుడు ఆంజనేయులు మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్ల స్థానిక ఎస్‌ఐ ఎం. ఐలయ్య తెలిపారు. సైదమ్మకు కొంతకాలంగా మతిస్థిమితం సరిగ్గా ఉండటంలేదని ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదని ఎస్‌ఐ పేర్కొన్నారు. చుట్టుపక్కల వారు హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె కుమారుడు ఆంజనేయులకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి ఎంత వెతికినా సైదమ్మ ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment