నీటి దొంగలు
కాల్వకు గండి కొట్టి అక్రమంగా తరలింపు
మిర్యాలగూడ : స్థిరీకరించిన పొలాలకు అందాల్సిన సాగునీటిని అక్రమంగా ఇతర భూములకు తరలిస్తున్నారు. కాల్వకు గండి కొట్టి బావులు నింపుకుని పొలాలకు నీటిని పారిస్తున్నారు. అలా నీటిని మళ్లించినందుకు ఓ నాయకుడు ఆయా రైతుల నుంచి ఎకరాకు ఇంత మొత్తం అని డబ్బు వసూలు చేస్తున్నాడు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు. ఇదీ.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం మండలంలోని లిఫ్టు పరిధిలో జరుగుతున్న తతంగం.
35 ఏళ్ల క్రితం లిఫ్టు ఏర్పాటు
దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ శివారులో భూములకు నీరందించాలన్న లక్ష్యంతో 35 ఏళ్ల క్రితం నాలుగు వేల ఎకరాలకు సరిపడా లిఫ్టును ఏర్పాటు చేశారు. అన్నమేరు వాగు నుంచి లిఫ్టు చేస్తూ ముదిమాణిక్యం మేజర్‌కు అనుసంధానం చేశారు. ఈ లిఫ్టు నీటి ద్వారా అడవిదేవులపల్లి, ముదిమాణిక్యం, వీర్లపాలెం గ్రామాల్లోని భూములకు నీరందుతుంది. అయితే.. కాల్వ పక్కన భూములున్న రైతులు కాల్వకు గండి కొట్టి లిఫ్టు ద్వారా వచ్చే నీటిని తమ బావులకు తరలిస్తున్నారు. బావులకు మోటార్లు పెట్టి వారి భూములు పారించుకుంటూ.. మిగిలిన నీటిని ఎకరాకు ఇంత అని ధర నిర్ణయించి ఇతరులకు అమ్ముతున్నారు. ఒక తడికి రూ.3 వేల నుంచి రూ.4 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. కాల్వ నీరు ఇలా అక్రమంగా తరలిపోతుండడంతో ఈ లిఫ్టు కింద నిర్ధేశించిన పొలాలకు నీరు అందడం లేదు. అధికారులు స్పందించి నిర్ధేశించిన పొలాలకు నీరు అందేలా చూడాలని.. నీటిని అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఫ ఎకరాకు ఇంత మొత్తం అంటూ రైతుల నుంచి ఓ నాయకుడి వసూళ్లు
ఫ స్థిరీకరించిన ఆయకట్టుకు అందని నీరు
మా దృష్టికి రాలేదు
నీటి అక్రమ తరలింపు విషయం మా దృష్టికి రాలేదు. రైతులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. లిఫ్టుకు అనుసంధానంగా ఉన్న పంట పొలాలకు మాత్రమే నీటిని తరలించాలి. అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– వెంకటరమణ, ఎన్‌ఎస్పీ డీఈ
Comments
Please login to add a commentAdd a comment