నీలగిరి మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం!
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణం మాస్టర్‌ప్లాన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దాదాపు పది సంవత్సరాల నుంచి కొనసాగిన మాస్టర్‌ప్లాన్ డ్రాఫ్ట్ కొద్ది నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ యంత్రాంగం పంపించిన విషయం తెలిసిందే. మున్సిపల్ యంత్రాంగం పంపించిన మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం తెలుపుతూ జీవో విడుదల చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పాత పట్టణంతో పాటు విలీనమైన ఏడు గ్రామ పంచాయతీల రెవెన్యూ పరిధిని కలుపుకొని మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. కొత్తగా తయారుచేసిన మాస్టర్ ప్లాన్ 2041 వరకు కొనసాగనుంది. కొత్త మాస్టర్‌ప్లాన్ శనివారం విడుదల కానుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ.30,26,960
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి మొక్కుబడిగా భక్తులు 48 రోజుల్లో సమర్పించిన కానుకల హుండీలను శుక్రవారం లెక్కించగా.. రూ.30,26,960 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ నవీన్‌కుమార్ తెలిపారు. అన్నదానం హుండీడి ఆదాయం రూ.29,740 వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి, నర్సిరెడ్డి, రాజ్యలక్ష్మి, నరేష్, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పథకాల అమలులో
ప్రభుత్వం విఫలం
మిర్యాలగూడ : పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థాినిక సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఊరికో కోడి ఇంటికో ఈక అనే విధంగా పథకాల అమలు తీరు ఉందన్నారు. సంక్రాంతికి ఆ తర్వాత జనవరి 26కు రైతు భరోసా ఇస్తామని చెప్పారని.. ఇప్పుడు ఆ తేదీ దాటినా ఇవ్వలేదన్నారు. మహిళలకు రూ.2500 భృతి పథకం ఊసే లేదన్నారు. భూమిలేని పేదలందరికీ రూ.12 వేలు అందించాలన్నారు. రేషన్‌షాపుల ద్వారా 12రకాల నిత్యావసర సరుకులు అందించాలన్నారు. సమావేశంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, రామ్మూర్తి, పరుశురాములు, అంజాద్ తదితరులు పాల్గొన్నారు.
భూ నిర్వాసితులందరికీ పరిహారం
దేవరకొండ : వివిధ ప్రాజెక్టుల కింద ముంపునకు గురయ్యే భూ నిర్వాసితులందరికీ ప్రభుత్వం పరిహారం అందిస్తుందని దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి అన్నారు. శుక్రవారం డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురయ్యే నక్కలగండితండా భూ నిర్వాసితులకు 91 ఇళ్లకు సంబంధించి రూ.4 కోట్ల 8లక్షల విలువైన చెక్కులు అందజేసి మాట్లాడారు. 63 ఎకరాల భూములకు సంబంధించి రూ.కోటీ 90లక్షల మంజూరు కాగా వాటిని లబ్ధిదారులకు చెక్కుల ద్వారా అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భూ నిర్వాసితులకు చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద పునరావాసం కల్పించేందుకు గాను 10 ఎకరాల భూ సేకరణ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ సత్యనారాయణ, డీఈ చక్రపాణి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment