చివ్వెంల(సూర్యాపేట): బైక్‌లు చోరీ కేసులో నిందితుడికి జైలుఽశిక్ష విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత మంగళవారం తీర్పు వెలువరించారు. తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామానికి చెందిన పోలెపాక రమేష్ 2024 ఆగస్టులో సూర్యాపేటలో 3 బైకులు, అదే సంవత్సరం సెప్టెంబర్‌లో ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామ శివారులోని దండు మైసమ్మ ఆలయం వద్ద ఒక బైక్ చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐలు కుశలవ, ఎ. సైదులు కేసు నమోదు చేయగా.. రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పలువును సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.హేమలతనాయుడు వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి నాలుగు నెలల పదకొండు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు కోర్టు కానిస్టేబుళ్లు సీహెచ్. రవికుమార్, ఎం. చైతన్య సహకరించారు.
స్కూటీ అపహరించిన కేసులో..
స్కూటీ అపహరించిన వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత మంగళవారం తీర్పు వెలువరించారు. హన్మకొండకు చెందిన వన్నె శివకుమార్ స్కూటీపై ర్యాపిడో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 2024 ఆగష్టు 8వ తేదీన మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన విన్నకోట సాయికుమార్ హన్మకొండకు వచ్చాడు. స్థానిక బస్టాండ్ వద్ద నుంచి ఖాజీపేట వెళ్లాలని ర్యాపిడోలో బైక్ చేసుకున్నాడు. ర్యాపిడో నడుపుకుంటున్న శివకుమార్ సాయికుమార్‌ను స్కూటీపై హన్మకొండ బస్టాండ్ వద్ద ఎక్కించుకుని ఖాజీపేట వద్ద డ్రాప్ చేశాడు. అయితే తనకు జనగామలో పని ఉందని, బోధకాలు ఉండటం వల్ల నడువలేకపోతున్నానని సాయికుమార్ శివకుమార్‌కు చెప్పి ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పి జనగామకు తీసుకెళ్లాడు. అక్కడ నుంచి సూర్యాపేటలో పని ఉందని సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తనకు ఒక తెల్లని వస్త్రం కావాలని షాపులోకి వెళ్లి తీసుకురమ్మని శివకుమార్‌ను షాపులోకి పంపించాడు. శివకుమార్ షాపులోకి వెళ్లగానే అతడి స్కూటీపై సాయికుమార్ పారిపోయాడు. బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్‌ఐ గోపికృష్ణ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ హేమలతనాయుడు వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి 2నెలల 29రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. పీపీకి కోర్టు కానిస్టేబుల్ రవికుమార్ సహకరించారు.
నాలుగు నెలలు కారాగార శిక్ష..
ఆత్మకూర్ (ఎస్): మండల పరిధిలోని ఏనుబాముల గ్రామ స్టేజీ వద్ద గతేడాది జూన్‌లో బైక్ చోరీ చేసిన నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత తీర్పు వెలువరించినట్లు ఎస్‌ఐ బి. శ్రీకాంత్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామానికి చెందిన పి. రమేష్ బైక్ చోరీ చేయగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ సైదులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి 4నెలల 4రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment