దళితుల్లో ఏ వర్గానికీ వ్యతిరేకంగా మాట్లాడలేదు
● చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
● సూర్యాపేటలో వడ్లకొండ కృష్ణ కుటుంబానికి పరామర్శ
సూర్యాపేటటౌన్: దళితుల్లో ఏ వర్గానికీ తాను వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం పబ్లిసిటీ కోసమే మంద కృష్ణ మాదిగ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయన శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులను వివేక్ వెంకటస్వామి కుటుంబం పరోక్షంగా వెనకుండి నడిపించిందన్న మంద కృష్ణమాదిగ ఆరోపణలపై వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ.. మాల, మాదిగలది పొలిటికల్ గొడవని, మంద కృష్ణమాదిగ వెనకాల ఏ పార్టీ ఉందో అందరికీ తెలుసని, వాళ్ళు ఆడిపిస్తున్నట్లు మందకృష్ణ మాదిగ ఆడుతున్నారని అన్నారు. ప్రజల్లో ఆదరణ లేని మంద కృష్ణమాదిగ మూడుసార్లు ఎన్నికల్లో పోటీచేస్తే డిపాజిట్ కూడా రాలేదని విమర్శించారు. తెలంగాణలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న మాలలను చిన్నచూపు చూస్తున్నారనే పోరాటం చేస్తున్నామే తప్ప.. ఎస్సీ రిజర్వేషన్ అడ్డుకోవడం కోసం కాదని, దీనిపై మాల సింహగర్జనలో స్పష్టంగా చెప్పామన్నారు. మాల, మాదిగలను విభజించి పాలించాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు.
రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
సూర్యాపేటలో ఇటీవల పరువు హత్యకు గురైన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి సూర్యాపేటలోని మాల బంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుల దురహంకార హత్యలపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి హాంతకులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీతో వివేక్ వెంకటస్వామి మాట్లాడి నిందితులను శిక్షించాలని కోరారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. వడ్లకొండ కృష్ణ హత్య దారుణమని, దీనిపై నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తల్లమళ్ళ హుస్సేన్, జిల్లా అధ్యక్షుడు వేణు బలరాం, నాయకులు బొల్లెద్దు దశరథ, రవి, కట్ట సైదులు, కట్ట మురళి, అఖిల్, నరేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment