చెర్వుగట్టు జాతరకు వేళాయే
నార్కట్‌పల్లి: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ ఉత్సవాలకు చెర్వుగట్టు ముస్తాబవుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
5వ తేదీ కల్యాణం
ఈ నెల 4వ తేదీ ఉదయం ఆలయంలోని ప్రధాన మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మాత్సవాలను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 5వ తేదీ తెల్లవారుజామున స్వామివారి కల్యాణం, 6వ తేదీ తెల్లవారుజామున అగ్నిగుండాలు, 7వ తేదీ తెల్లవారుజామున దోపోత్సవం, సాయంత్రం ఏకాంతసేవ, 8వ తేదీ ఉదయం రుద్రాభిషేకం, ఏకాంతసేవ, 9వ తేదీ సాయంత్రం గజవాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
కల్యాణోత్సవం టికెట్ రూ.1000
స్వామివారి కల్యాణంలో పాల్గొనాలనుకునే భక్తులకు టికెట్ ధర రూ.1000గా ఆలయ అధికారులు నిర్ణయించారు. 300 మందికి మాత్రమే టికెట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. బ్రహోత్సవాల సందర్భంగా ఏడు రోజుల పాటు గట్టు పైకి వెళ్లే వాహనాలకు టోల్ నిర్వాహకులు టోల్ చార్జీలు వసూలు చేయవద్దని ఆలయ అధికారులు సూచించారు. అదేవిధంగా గట్టు పైన మూడు గుండ్ల పైకి 4, 5 తేదీల్లో భక్తులు అనుమతించట్లేదని తెలిపారు.
రెండు లక్షల లడ్డూలు తయారీ
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం దాదాపు రెండు లక్షల లడ్డూలు తయారీ చేయించడంతో పాటు ప్రసాదం విక్రయించేందుకు పది కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం ఆమె ఎస్పీ శరత్‌చంద్ర పవార్, పలువురు అధికారులతో కలసి చెర్వుగట్టును సందర్శించారు. గట్టు పైన, కింద వివిధ ప్రదేశాలతో పాటు కల్యాణ మండపం, కోనేరు, టాయిలెట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు బల్క్ వాటర్ సరఫరా చేయాలని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో తగినంత సిబ్బందిని నియమించి పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేయాలని సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఎస్పీ శివరాంరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ఆర్డీఓ యాణాల అశోక్‌రెడ్డి, సీఐ నాగరాజు, ఆలయ ఈఓ నవీన్‌కుమార్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ ఉమేష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అరుణ్‌కుమార్, ఆర్‌ఐ తరుణ్ ఉన్నారు.
ఫ 4 నుంచి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు
ఫ 5వ తేదీ తెల్లవారుజామున
రామలింగేశ్వరుడి కల్యాణం
ఫ ఏర్పాట్లు చేస్తున్న దేవాదాయశాఖ
నేడు నగరోత్సవం
చెర్వుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నగరోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ నవీన్‌కుమార్ తెశనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆదివారం సాయంత్రం నల్లగొండ పట్టణంలోని రామాలయం వద్ద నగరోత్సవం ప్రారంభించి హైదరాబాద్ రోడ్డులోని వీటీ కాలనీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment