మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం
శాలిగౌరారం: పాత కక్షల నేపథ్యంలో శాలిగౌరారం మండలంలోని ఉప్పలంచ గ్రామ మాజీ సర్పంచ్‌పై ఐదుగురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పలంచ గ్రామ మాజీ సర్పంచ్ బండారు మల్లయ్య(53)కు అదే గ్రామానికి చెందిన రుద్రారం యాదయ్య, రుద్రారం మల్లేష్, రుద్రారం చినయాదయ్యతో కొంతకాలంగా వ్యక్తిగత, రాజకీయ గొడవలు ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 2019 జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బండారు మల్లయ్య కాంగ్రెస్ నుంచి, రుద్రారం మల్లేశ్ బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మల్లేశ్‌పై మల్లయ్య గెలుపొందారు. దీంతో మల్లయ్యపై రుద్రారం మల్లేష్ కుటుంబ సభ్యులు రాజకీయంగా కక్ష పెంచుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
పాపమ్మ గుడి స్థల వివాదంతో..
గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల పాపమ్మ గుడి స్థలాన్ని రుద్రారం యాదయ్య, రుద్రారం మల్లేష్, రుద్రారం చినయాదయ్య కుటుంబ సభ్యులు కొంతమేర ఆక్రమించారని, ఈ విషయమై రెండు వర్గాలుగా విడిపోయిన ఎస్సీలు గుడి స్థల వివాదంలో పరస్పరం దాడులు చేసుకొని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ క్రమంలో యాదయ్య, మల్లేష్, చినయాదయ్య కుటుంబాలను కులపెద్దలు కుల బహిష్కరణ చేశారని, తమను కుల బహిష్కరణ చేసేందుకు బండారు మల్లయ్యే కారణమంటూ యాదయ్య, మల్లేష్, చినయాదయ్య కుటుంబాలు అతడిపై కక్ష పెంచుకున్నారని ఎస్‌ఐ వివరించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఇరువర్గాలకు సర్దిచెప్పినట్లు తెలిపారు.
దారికాచి.. మాటువేసి..
అయితే గ్రామంలో బండారు మల్లయ్య ఉన్నంత వరకు తాము రాజకీయంగా, సామాజికంగా ఎదగలేమని భావించిన యాదయ్య, మల్లేష్, చినయాదయ్యలు ఎలాగైనా మల్లయ్యను అంతమొందించాలని పథకం రచించారని, మల్లయ్య మంగళవారం ఉదయం గ్రామ శివారులో తన వ్యవసాయ పొలం వద్దకు బైక్‌పై వెళ్తుండగా.. దారికాచి యాదయ్య, మల్లేష్, చినయాదయ్యతో పాటు మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మల్లయ్యపై మారణాయుధాలతో దాడి చేశారని ఎస్‌ఐ వివరించారు. ఈ దాడిలో మల్లయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడని, అదే సమయంలో గ్రామానికి చెందిన మరో రైతు అటుగా వస్తుండటాన్ని గమనించి దాడి చేసిన వారు అక్కడి నుంచి పరారయ్యారని పేర్కొన్నారు. మల్లయ్యను 108 వాహనంలో నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడ నుంచి నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్‌కు తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మల్లయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుడి భార్య బండారు చంద్రనీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
ఘటనా స్థలాన్ని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి పరిశీలించారు. గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు విషయంపై పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీఎస్పీ వెంట శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, ఎస్‌ఐ సైదులు ఉన్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
ఫ పొలం వద్దకు వెళ్తుండగా
మారణాయుధాలతో దాడి
ఫ తీవ్ర గాయాలు..
నిమ్స్ హాస్పిటల్‌కు తరలింపు
Comments
Please login to add a commentAdd a comment