కామేశ్వరీదేవికి వెండి కాసుల హారం | Sakshi
Sakshi News home page

కామేశ్వరీదేవికి వెండి కాసుల హారం

Published Sat, Apr 20 2024 1:20 AM

 పల్లకీ సేవ నిర్వహిస్తున్న భక్తులు  - Sakshi

మహానంది: మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి మహానందికి చెందిన రిటైర్డ్‌ వీఆర్‌ఓ సత్యనారాయణ దంపతులు శుక్రవారం వెండి కాసుల హారం అందించారు. ఈ మేరకు వారు కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం డొనేషన్‌ కౌంటర్‌ వద్దకు చేరుకుని ఏఈఓ యర్రమల మధు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శశిధర్‌రెడ్డికి హారం అందించారు. 59 గ్రాముల బరువు ఉందని, వెండి కాసుల హారానికి బంగారు పూత వేయించినట్లు దాతలు చెప్పారు.

హోమ్‌ ఓటింగ్‌ దరఖాస్తుకు 22 వరకు గడువు

కోవెలకుంట్ల: 85 సంవత్సరాలు వయస్సు పైబడిన వృద్ధులు, అంగవైకల్యం కలిగిన వ్యక్తులు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి వద్ద నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆయా కేటగిరిలకు చెందిన ఓటర్లు ఫారం–12డీని సమర్పించాల్సి ఉంది. పూర్తి వివరాలతో నింపిన ఫారాన్ని ఈ నెల 22వ తేదీలోపు రిటర్నింగ్‌ అధికారులకు అందజేయాలని ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

25న గురుకుల ప్రవేశ పరీక్ష

నంద్యాల(న్యూటౌన్‌): ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరం ప్రవేశానికి ఈనెల 25వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి నరసింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8 తరగతులకు ఏపీఆర్‌ఎస్‌ Cat–2024 ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, కళాశాలలకు ఏపీఆర్‌జేసీ, డీసీసెట్‌ – 2024 మధ్యాహ్నం 2.30గంటల నుండి 5గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షకు సంబంధించిన అభ్యర్థులు హాల్‌టికెట్లను https://aprs.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. అభ్యర్థులు ఐడీతో పాటు పుట్టిన తేదీ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలన్నారు.

నేడు ‘ఏకలవ్య’ పరీక్ష

కర్నూలు(అర్బన్‌): రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ఏకలవ్వ మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష బీ క్యాంప్‌లోని ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో శనివారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఏ లక్ష్మిగుర్రప్ప తెలిపారు. జిల్లాకు చెందిన విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుందని ఇక్కడ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లో 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు కూడా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారన్నారు. మిగిలిన సీట్లలో ప్రవేశం పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రవేశ పరీక్షకు హాజరు కావాలన్నారు. ప్రవేశ పరీక్ష ఉదయం 11.30 గంటల నుంచి 1.30 గంటల వరకు జరుగుతుందని, ఎండలు అధికంగా ఉన్నందున పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 10 గంటలకంతా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ప్రిన్సిపాల్‌ కోరారు.

శాస్త్రోక్తంగా

చౌడేశ్వరిదేవి పల్లకీ సేవ

బనగానపల్లె: నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి శుక్రవారం శాస్త్రోక్తంగా పల్లకీ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ కామేశ్వరమ్మ ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో కుంకుమార్చన అభిషేకం తదితర పూజలు జరిగాయి. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా ముస్తాబు చేసి పల్లకీలో ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా పల్లకీ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.

ఏఈఓ మధుకు వెండి హారం అందిస్తున్న సత్యనారాయణ దంపతులు
1/1

ఏఈఓ మధుకు వెండి హారం అందిస్తున్న సత్యనారాయణ దంపతులు

Advertisement
Advertisement