నల్లమలకు సాంకేతిక రక్ష!
కెమెరాలతో సంరక్షణ మరింత సులభం
పులుల సంరక్షణ పర్యవేక్షణకు ఇన్‌ఫ్రా రెడ్ కెమెరాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ఇటీవల మరింత మెరుగైన కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర కాస్త ఎక్కువే అయినా నల్లమలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా. ఈ కెమెరాల ఏర్పాటు వల్ల పులుల సంరక్షణ మరింత సులభమవుతుంది.
– సాయిబాబా, డీడీపీటీ,ఆత్మకూరు డివిజన్
ఆత్మకూరురూరల్: మన జాతీయ జంతువు పులి. ఆహారపు గొలుసులో అగ్రస్థానంలో ఉండే వీటిని సంరక్షించుకొని..భవిష్యత్తు తరాలకు చూపించాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్దేశంతోనే నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం అధికారులు పులుల సంరక్షణకు పలు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు పులుల జాడ, కదలికలను గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. తాజాగా నల్లమలలోని ప్రతి కదలిక కళ్ల ముందు కనిపించేలా సౌరశక్తితో పనిచేసే అత్యాధునిక కెమెరాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
మూడోతరం కెమెరాలో అనేక ప్రత్యేకతలు
నల్లమలలో విధులు నిర్వహించే అధికారులు మొదట్లో చేత్తో పట్టుకు తిరిగే కెమెరాలతో అడవి జంతువులను రహస్యంగా ఫొటోలు తీసేవారు. వీటిని మొదటి తరం కెమెరాలు అనేవారు. తర్వాత ఇన్‌ఫ్రా రెడ్ కెమెరాలు వచ్చాయి. వీటిని జంతు సంచారం ఉంటుందనుకునే ప్రదేశాల్లో రెండువైపులా చెట్లకు కట్టి ఉంచుతారు. ఆ కెమెరాల ముందు నడిచి వెళ్లే జీవి శరీర ఉష్ణోగ్రతకు కెమెరా నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు (ఇన్‌ఫ్రారెడ్)తాకిన వెంటనే ఆటోమెటిక్‌గా కెమెరా క్లిక్ అయి అందులో ఉన్న మెమోరీ కార్డులో ఆ చిత్రం నిక్షిప్తమవుతుంది. నిర్ణీత సమయాల్లో ఆ మెమోరీ కార్డు నుంచి సేకరించిన చిత్రాలను విశ్లేషించి రికార్డు చేయడం పులి సంరక్షణంలో ఒక పెను మార్పుకు దారి తీసింది. తాజాగా మనిషి వేలి ముద్రల లానే పులి చర్మంపై ఉండే చారలు వేటికవే ప్రత్యేకం కావడంతో పులి చారలను బట్టి పులుల సంఖ్యను నిర్ధారించే సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేశారు. ఇటీవల ఎన్‌ఎస్‌టీఆర్ ఆత్మకూరు డివిజన్ నాగలూటి రేంజర్ దొరస్వామి అత్యంత ఆధునికమైన సోలార్‌మినీ పాన్ – టిల్ట్ కెమెరాలను తన రేంజ్‌లో ప్రవేశ పెట్టారు. ఎంపీ 4 వీడియో, ఆడియో టు వే సైరన్ సిస్టం కలిగిన ఇవి రాత్రి పగలు తేడా 360 డిగ్రీల కోణంలో క్వాలిటీతో ఫొటోలను తీస్తాయి. తనముందు వెళుతున్నది మనిషి అయితే వెంటనే సంబంధిత అధికారికి అలర్ట్ మెసేజ్ పంపుతాయి. ఈ కెమెరాను పర్యవేక్షించే వారు ఉన్న చోటి నుంచి వెంటనే బెదిరింపు సైరన్‌ను వినింపించ వచ్చు. అంతేకాదు ఈ కెమెరాలు నిరంతరాయంగా తనముందు వెళ్లే ప్రతి జంతువు, మనిషి ఫొటోలు తీసి మనం అనుసంధాని ంచిన మెయిల్‌కు పంపుతాయి. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ కెమెరాలను ఇటీవలే ప్రయోగాత్మకంగా నా లులూటి అటవీ రేంజ్ పరిధిలో నాలుగు, ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలో రెండు ఏర్పాటు చేశారు.
దశాబ్దంలో పులి సంతతిలో అద్భుత ప్రగతి
2014 నాటికి నల్లమలలో 35 పెద్దపులులు మాత్రమే ఉండేవి. ఇవి క్రమేపి పెరుగుతూ 2024 నాటికి 87 కావడం అన్నది పులుల సంరక్షణలో ఒక అద్భుతమని చెప్పవచ్చు. 87 పులులను కచ్చితంగా గుర్తించడంలో సాంకేతికత ఎంతో ఉపయోగ పడింది. 87 పెద్దపులులను వాటికుండే కోడ్‌తో సహా చిత్రాలను కూడా అటవీ అధికారులు సేకరించారు. అడవుల్లో మానవ సంచారాన్ని దాదాపు శూన్యం చేయడం ( చెంచులకు మినహాయింపు), అక్రమంగా చెట్ల నరికివేతను నిరోధించడం, పులి ఆహార జంతువుల నిష్పత్తి పడిపోకుండా చూడడం వంటి చర్యలు దశాబ్ద కాలంలో పులుల సంఖ్య పెరుగుదలకు కారణమయ్యాయి. నల్లమల వెయ్యి పులులకు ఆశ్రయం ఇవ్వగల అటవీ ప్రాంతమని, ఇది భవిష్యత్తులో సాకారమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పులుల సంరక్షణకు
అత్యాధునిక కెమెరాలు
ఎంపీ 4 వీడియో, ఆడియో టు వే
సైరన్ సిస్టం
అడవిలోని ప్రతి జీవి కదలికపై నిఘా
ఇప్పటికే ప్రయోగాత్మకంగా
నాగలూటి, ఆత్మకూరు అటవీరేంజ్‌లలో
అమలు
Comments
Please login to add a commentAdd a comment