చౌడేశ్వరిదేవి హుండీ కానుకల లెక్కింపు
బనగానపల్లె రూరల్: నందవరం చౌడేశ్వరిదేవి ఆలయ హుండీల్లో భక్తులు వేసిన కానుకలను లెక్కించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, పర్యవేక్షణాధికారి హరిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ ఏడాది ఆగస్టు 7 నుంచి ఇప్పటి వరకు వేసిన కానుకలను లెక్కించారు. మొత్తం రూ.18,27,724 నగదు ఉందని, బంగారం, వెండి వస్తువులను ఇంకా లెక్కించాల్సి ఉందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో ఏపీజీబీ ఫీల్డ్ ఆఫీసర్ బాబు, ఆళ్లగడ్డ సేవ సమితి సంఘం సభ్యులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.
875.20 అడుగులకు శ్రీశైల జలాశయ నీటిమట్టం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైల జలాశయ నీటిమట్టం శనివారం సాయంత్రం సమయానికి 875.20 అడుగులకు చేరుకుంది. నీటినిల్వ 164.7532 టీఎంసీలకు చేరుకున్నాయి. సుంకేసుల నుంచి 6,759 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతుంది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి అతిస్వల్పంగా 584 క్యూసెక్కుల నీరు రాగా జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 13,952 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో 1.816 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.
హైడల్ ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్
పాణ్యం: మండల పరిధిలోని పిన్నాపురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న హైడల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనీయా శనివారం సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం పనులు ఎంత మేర పూర్తి అయ్యాయి.. ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల వివరాలు, రైతులకు చెల్లించిన పరిహారం తదితర వాటిపై ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి, శిశవశంకర్‌రెడ్డి, కంపెనీ అధికారులు నాయుడు పాల్గొన్నారు.
25న జెడ్పీ సర్వసభ్య సమావేశం
కర్నూలు (అర్బన్): జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 25వ తేదీన నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి శనివారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యుత్, నీటిపారుదల శాఖలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశానికి కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ఇన్‌చార్జ్ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌తో పాటు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరుకావాలని సీఈఓ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment