శ్రీశైలక్షేత్రాభివృద్ధికి కృషి
● నూతన ఈఓ చంద్రశేఖర ఆజాద్
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాపుణ్యక్షేత్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని దేవస్థానం నూతన ఈఓ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ అన్నారు. సోమవారం ఇన్‌చార్జి ఈఓ చంద్రశేఖరరెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకొని మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన దర్శనాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. పర్యావరణ పరిరక్షణ, క్షేత్ర సుందరీకరణలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందిస్తామన్నారు.
పది పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు
నంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును పెంచినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీలోపు ఫీజు చెల్లించేందుకు గడువు ఉండగా ఈ నెల 26వ తేదీ వరకు పెంచారు. రూ.50 అపరాధ రుసుంతో 19 నుంచి 25వ తేదీలోపు, రూ.200 అపరాధ రుసుంతో 26 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో వచ్చే నెల 4 నుంచి 10వ తేదీ వరకు గడువు ఉందని డీఈఓ వెల్లడించారు. రెగ్యులర్ అభ్యర్థులకు అన్ని సబ్జెక్టులకు రూ.125, 3 సబ్జెక్టులకుపైగా ఉంటే రూ.125, 3 సబ్జెక్టుల లోపు ఉంటే రూ.110, ఒకేషనల్ అభ్యర్థులకు అదనంగా రూ.60, తక్కువ వయస్సు కలిగిన అభ్యర్థులకు రూ.300, మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం అవసరం అయితే రూ.80 ప్రకారం ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫీజు చెల్లింపు తదితర పూర్తి సమాచారం కోసం www.bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని డీఈఓ పేర్కొన్నారు.
ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు
బొమ్మలసత్రం: సున్నిపెంట గ్రామానికి చెందిన విఠల్ రావు, సంజయ్‌రెడ్డి, అనిల్ కుమార్ అనే వ్యక్తులు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి రూ.8.21 లక్షలు తీసుకుని మోసం చేశారని అదే గ్రామానికి చెందిన విక్టర్‌పాల్ ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణాకు ఫిర్యాదు చేశారు. సోమవారం స్థానిక పోలీస్ సమావేశ భవనంలో ఎస్పీ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి 78 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టపరమైన సమస్యలను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment