తల్లిదండ్రులను పూజించాలి
● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
పగిడ్యాల: తల్లిదండ్రులను ప్రతిఒక్కరూ పూజించాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. కార్తీక మాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని స్థానిక ఉమామహేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం భక్తులతో మాట్లాడారు. సంప్రదాయ సమాజం ఆవిష్కృతం కావాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతిక విలువలను బాల్యం నుంచే నేర్పించాలన్నారు. యుక్త వయస్సు రాగానే పెళ్లిళ్లు చేసుకున్నా మగ పిల్లలు వెంటనే భార్య మాట విని తల్లిదండ్రుల నుంచి విడిపోయి వేరే కాపురాలు సాగిస్తూ భయభక్తులు లేకుండా వారికి అన్నం పెట్టని పరిస్థితులను గమనిస్తున్నామని ఆయన ఆవేదన చెందారు. కుటుంబ వ్యవస్థ బలోపేతంగా ఉండాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్వామీజీలు చెప్పే బోధనలను గ్రహించి పాటించాలని కోరారు. కార్తీక మాసం శివునికి ఎంతో ఇష్టమైన మాసమని దీనిని పవిత్రంగా ఆచరించడం వల్ల పుణ్యప్రాప్తి లభిస్తుందన్నారు. రాధామనోహర్ దాస్ స్వామిజీ మాట్లాడుతూ ప్రపంచమంతా బాగుండాలని కోరుకునేది సనాతన ధర్మమన్నారు. హైందవ ధర్మాన్ని రక్షించి భావితరాలకు అందించాలని ఐకమత్యంతో హిందూత్వాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలను నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో గీతా ఫౌండేషన్ చైర్మన్ యోగేష్‌ప్రభు, బీజేపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతామాధురి, బీజేపీ జిల్లా మోర్చా నాయకులు బీవీ సుబ్బారెడ్డి, జిల్లా నాయకులు చల్లా దామోధర్‌రెడ్డి, శిల్ప జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కొత్త ఇసుక రీచ్‌లకు టెండర్లు
కర్నూలు న్యూసిటీ: జిల్లాలో కొత్తగా ప్రారంభం కానున్న మూడు ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచినట్లు గనులు, భూగర్భ ఖనిజాల శాఖ ఉప సంచాలకులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌతాళం మడలంలో గుడికంబాలి, నదిచాగి, మరళిలో కొత్తగా ఇసుక రీచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. వాటిల్లో ఇసుక తవ్వకం, నిర్వహణ కోసం ఆసక్తి ఉన్న కాంట్రక్టర్ల నుంచి టెండర్ల దరఖాస్తులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ నెల 19 నుంచి 27లోపు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించినట్లు తెలిపారు. దరఖాస్తుతో పాటు రూ.10వేల రూపాయలు డీడీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఏడాది గడువుకు దరావత్తు కింద రూ.5 లక్షలు చెలించాల్సి ఉంటుందని తెలిపారు.
మాట్లాడుతున్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment