మోసపోయాం.. న్యాయం చేయండి
● ఎస్పీకి పలువురు వినతులు
కర్నూలు (టౌన్): ‘ ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ చేసే అలవాటు ఉంది. అప్‌స్టాక్స్ ఏంజిల్–1 అనే ట్రేడింగ్ యాప్‌లో డబ్బు ఇన్వెస్ట్ చేసి విత్ డ్రా చేస్తున్నాను. సీఐఎన్‌వీ అనే ట్రేడింగ్ యాప్‌లో ఇన్వెస్ట్ చేయండి... అంటూ వాట్సాప్‌లో లింక్ వచ్చింది.. ఆ లింక్‌ను క్లిక్ చేశాను. నా బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.4.80 లక్షలు ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేశా. అయితే డబ్బు విత్‌డ్రా చేస్తుంటే రావడం లేదు. డబ్బు రికవరీ చేయించండి’ అని కర్నూలు నగరంలోని సంతోష్ నగర్‌కు చెందిన చాంద్‌బాషా ఫిర్యాదు చేశారు. సోమవారం కొత్తపేటలోని జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అధ్యక్షతన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎస్పీని కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 90 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటన్నింటిపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, సీఐ శివశంకర్ పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● తన పేరు మీద ఉన్న ఇల్లు, రెండున్నర ఎకరాల పొలం ఆక్రమించుకోవాలని మరుదులు శివప్ప, హనుమంతు, హింసిస్తున్నారని మద్దికెర మండలం యడవలికి చెందిన అల్లమ్మ ఫిర్యాదు చేశారు.
● కర్నూలు పాతబస్టాండ్‌లోని శ్రీలక్ష్మీ జ్యువెలర్స్‌కు చెందిన నాయుడు (షాప్ 30) బంగారం చేసి ఇస్తానని చెప్పి డబ్బు తీసుకుని పరారయ్యాడని కర్నూలు కృష్ణానగర్‌కు చెందిన వనజకుమారి ఫిర్యాదు చేశారు.
● ప్లాట్ ఇప్పిస్తామని చెప్పి కృష్ణ, జయరాం అనే వ్యక్తులు తన వద్ద డబ్బు తీసుకుని మోసం చేశారని కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన నరసింహారెడ్డి ఫిర్యాదు చేశారు.
● తన ఎకరా పొలంలోకి అక్రమంగా వచ్చి జొన్న పంట విత్తనం నాటుకోవడమేగాకుండా కేశవులు అనే వ్యక్తి దౌర్జన్యం చేస్తున్నాడని హాలహర్వి మండలం హాలహర్వి గ్రామానికి చెందిన హనుమంతమ్మ ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment