జీఓలు అమలు చేయాలి
కర్నూలు(హాస్పిటల్): సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ రాష్ట్ర ప్రతినిధి బృందంతో ఫిబ్రవరి 9న రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద జీఓలను అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. సోమవారం ఆశా వర్కర్స్ యూనియన్, సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు నిర్మలమ్మ, గౌస్‌దేశాయ్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శివలక్ష్మి మాట్లాడారు. తమ ప్రభుత్వం వస్తే ఆశాల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చి ఆరు నెలలైనా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు రిటైర్‌మెంట్ వయస్సును 62 ఏళ్లు చేసి ఆశ వర్కర్లకు మాత్రం 60 ఏళ్లకు ఎలాంటి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ లేకుండా ఇంటికి పంపించడం బాధాకరమన్నారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నందున ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, ఇతర పనులను కూడా ఆశా వర్కర్లతో చేయిస్తూ అధిక ఒత్తిడికి గురిచేస్తున్నారని విమర్శించారు. అనంతరం డీఎంహెచ్‌వో డాక్టర్ ఎల్.భాస్కర్‌కు వినతి పత్రం అందజేశారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఇకపై సచివాలయాల్లో డ్యూటీలు ఉండవని, అర్బన్ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లను వారు నివాసం ఉండే ప్రాంతానికి బదిలీ చేస్తామని, పీహెచ్‌సీ డాక్టర్‌తో సెలవు తీసుకునే వీలు కల్పిస్తామని, ఆశా వర్కర్లకు ఆర్థికభారం లేకుండా 21 రికార్డులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇచ్చే విధంగా మాట్లాడతానని, ఎన్‌సీడీ సర్వేకు ఆశా వర్కర్‌తోపాటు ఇతర ఉద్యోగులను కలిపి టీం వర్క్ చేసే విధంగా కలెక్టర్‌తో మాట్లాడి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సీఐటీయూ నగర నాయకులు మహమూద్, కుమార్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment