ఆలయం.. అపచారం
● కొలనుభారతి క్షేత్రం ఆవరణలో సిగరెట్ తాగుతున్న పురోహితుడు, సిబ్బంది
కొత్తపల్లి: రాష్ట్రంలోనే ఏకై క సరస్వతి క్షేత్రంగా వీరాజిల్లుతున్న కొలనుభారతి దేవి ఆలయ ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. పురోహితుడు అమ్మవారి క్షేత్ర ప్రాంగణంలోనే సిగరెట్ తాగడం, నిబంధనలు పాటించకుండా పూజలు చేస్తుండటంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భక్తుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు పురోహితుడిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరుకు చెందిన కొంత మంది భక్తులు ఆదివారం మధ్యాహ్నం 12:25 గంటలకు కొలనుభారతి క్షేత్రానికి చేరుకున్నారు. అప్పటికే ఆలయ తలుపులను పురోహితుడు చక్రపాణి శర్మ మూసివేశారు. దూరం నుంచి వచ్చామని, అమ్మవారికి చీరె, సారె సమర్పించేందుకు ఆలయ తలుపులు తెరవాలని కోరినా పురోహితుడు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో భక్తులతో దురుసుగా వ్యవహరించినట్లు సమాచారం. అయినా బతిమాలడంతో తలుపు తీసి ఒకే ఒక్క నిమిషంలో మంత్రాలు చదివి పూజను మమ అనిపించి, రూ.501 చెల్లించాలని డిమాండ్ చేశారు. చేసేదేమీలేక భక్తులు రుసుం చెల్లించి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా అమ్మవారికి పూజ నిర్వహించే సమయంలోనూ పురోహితుడు నుదుటన కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవడం లేదని ఇదేమి సంప్రదాయమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అదే రోజు క్షేత్రంలోని ఓ గదిలో పురోహితుడు కుర్చీపై, మరో సిబ్బంది కింద కూర్చొని దర్జాగా సిగరేట్ కాల్చుతూ భక్తుల కంట పడ్డారు. క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్న పురోహితుడిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆలయ ఈఓ రామలింగారెడ్డిని వివరణ కోరగా విచారణ జరిపి, నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment