చెంచు గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆత్మకూరు: చెంచు గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ధనుంజయ తెలిపారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో శ్రీశైలం నియోజకవర్గంలోని చెంచుల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. కొట్టాల చెరువు గ్రామానికి చెందిన గురువయ్య, విజయలక్ష్మి తమ పొలాలకు బోరుబావులు కావాలని వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ ప్రత్యేకాధికారి కె.జి.నాయక్, ఏపీఓ నాగార్జున, గిరిజనులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● తనకు రెండున్నర ఎకరాల పొలం కావాలని కొత్తపల్లి చెంచుగూడేనికి చెందిన ఉత్తలూరు నాగమ్మ వినతిపత్రం అందించారు.
● కొత్తపల్లి చెంచుగూడెం వరకు రోడ్లు నిర్మించాలని పలువురు గిరిజనులు విన్నవించారు.
● తన అత్తమామలకు చెందిన పొలాన్ని ఓబులేష్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నాడని, న్యాయం చేయాలని ఓ మహిళ వినతి పత్రం అందించింది.
● తమ గూడేనికి తెలుగుగంగ కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి పొలాలకు సాగునీరు అందించాలని, చెరువులకు నీటితోపాటు ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయాలని, భూమిలేని కుటుంబాలకు భూమి ఇవ్వాలని, 31 కుటుంబాల వారికి ఇళ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలని బండిఆత్మకూరు మండలం నారపురెడ్డికుంటకు చెందిన గిరిజనులు అర్జీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment