న్యాయ సంస్థలు తరలిస్తే ఊరుకోం
అన్యాయాన్ని ప్రశ్నిద్దాం
సీమ ప్రాంతానికి జరిగే అన్యాయాన్ని ప్రతి న్యాయవాది ప్రశ్నించాలి. ఇందుకు వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టి సీమ ప్రజల గొంతుక వినిపించాలి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేవరకు విధులు బహిష్కరించి ప్రజా ఉద్యమం చేపట్టకపోతే న్యాయవాదులంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. గడిచిన 50 ఏళ్లుగా సీమ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. ఇకనైనా మనం మేలుకోవాలి.
– వి.కృష్ణమూర్తి, న్యాయవాది
ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం
కర్నూలులో ఏర్పాటైన వివిధ న్యాయ సంబంధ సంస్థలు తరలింపును కలిసికట్టుగా అడ్డుకుందాం. సర్కారు దిగి వచ్చే వరకు పోరాడదాం. సీమ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రతి రాజకీయ పార్టీ ఉద్యమానికి సహకరించి ప్రజల పక్షాన నిలవాలి. అప్పుడే ఈప్రాంతానికి న్యాయం జరుగుతుంది.
– గోపాలకృష్ణయ్య, న్యాయవాది
సీమ గొంతు కోస్తున్న బాబు
అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతంలో ఒకటైన కర్నూలును కొద్దో గొప్పో అభివృద్ధి చేద్దామని గత ప్రభుత్వం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఎయిమ్స్, ట్రిపుల్ ఐటీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్, విద్యుత్ రెగ్యులేటరీ తదితర ప్రభుత్వ సంస్థలను కర్నూలులో ఏర్పాటు చేసింది. వాటిని ఇప్పుడు చంద్రబాబు అమరావతికి తరలించి సీమ ప్రజల గొంతును కోయాలని చూడటం సరికాదు.
– వజ్రం భాస్కర్, సీనియర్ న్యాయవాది
పార్టీలకు అతీతంగా ఉద్యమం
రాష్ట్ర విభజన నాటి నుంచి సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు, ప్ర జలు ఆందోళనలు చేశారు. గత ప్రభుత్వం స్పందించి కొన్ని సంస్థలను కర్నూలులో ఏర్పాటు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అ న్ని సంస్థలను అమరావతికి తరలించాలని చూస్తోంది. ఇది దుర్మార్గం. దీనిపై పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపడతాం. – ఆర్.నరసింహులు, న్యాయవాది
కర్నూలు (లీగల్): గత ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీక రణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. అందులో భాగంగానే రాయలసీమ ముఖ్యద్వారమైన కర్నూలు ను న్యాయ రాజధానిగా ప్రకటించి పలు న్యాయ సంస్థలను ఏర్పాటు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని తరలించేందుకు కుట్ర పన్నుతోంది. ఇప్పటికే కర్నూలులో ఏర్పాటైన లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌లను అమరావతికి తరలించనున్నట్లు రాష్ట్ర హైకోర్టుకు తెలపడం కూడా జరిగింది. దీనిని కర్నూలు జిల్లా న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. న్యాయ సంస్థల తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం కర్నూలు బార్ అసోసియేషన్ అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో పలువురు జిల్లా న్యాయవాదులు పాల్గొని ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఐదునెలలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. పలుమార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించి బెంచ్ విషయం ప్రస్తావించకపోవడం అన్యాయమన్నారు. రాయలసీమ వాసిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఏర్పాటైన సంస్థలను అమరావతికి తరలించే ఆలోచన మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ కూటమి సర్కారు వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడ నుంచి ఏ ప్రభుత్వ సంస్థను తరలించమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా మాట్లాడుతూ న్యాయ సంస్థల తరలింపును అడ్డుకునేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన కార్యదర్శి బీఎస్ రవికాంత్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభు త్వం సీమ ప్రజల ఆగ్రహానికి గురికాకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థలను ఎక్కడికీ తరలించరాదన్నారు. సీనియర్ న్యాయవాదులు వై.జయరాజు, కె.ఓంకార్ మాట్లాడుతూ మీరు గతంలో మాదిరి కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తారని భావించి ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారని.. ఇప్పుడు మళ్లీ పాత పంథానే అవలంభిస్తే ఎలా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాజధాని కోస్తా ప్రాంతంలో ఉంటే హైకోర్టు రాయలసీమలో ఉండాలన్నారు. ఇది సీమ ప్రజల హక్కు అన్నారు. 2014 సంవత్సరంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి తర్వాత పట్టించుకోలేదన్నారు. టీడీపీ భాగస్వామ్య పార్టీలైనా బీజేపీ, జనసేన రాయలసీమకు హైకోర్టు తరలిస్తే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇప్పటి వరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకపోగా ఉన్న వాటికి అమరావతికి తరలిస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా నేటి నుంచి న్యాయవాదులు తమ కోర్టు విధులను బహిష్కరించి ప్రజలతో కలసి ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. కర్నూలులో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు కాకుండా చంద్రబాబు కోర్టుల్లో పిటిషన్లు వేయించి అడ్డుకొని ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారని సీనియర్ న్యాయవాదులు ఎం.సుబ్బయ్య, పి.సువర్ణారెడ్డి విమర్శించారు. సమావేశంలో న్యాయవాదులు బి.చంద్రుడు, శేషన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసమే
గత ప్రభుత్వం న్యాయ రాజధాని ప్రకటన
అందులో భాగంగానే లోకాయుక్త,
మానవ హక్కుల కమిషన్
తదితర ఏర్పాటు
కూటమి ప్రభుత్వం వాటిని
తరలించాలనుకోవడం దుర్మార్గం
ఉపసంహరించుకోకపోతే ఉద్యమం
జిల్లా న్యాయవాదులు హెచ్చరిక
నేటి నుంచి విధుల బహిష్కరణకు
పిలుపు
Comments
Please login to add a commentAdd a comment