రైలు నుంచి పడి వ్యక్తి మృతి
మద్దికెర: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మద్దికెర– గుంతకల్లు స్టేషన్ల మధ్య గురువారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మద్దికెర నుంచి గుంతకల్లు వైపు వెళ్లే రైల్ ట్రాక్ 355 –11 కి.మీ. వద్ద సుమారు 60 ఏళ్ల వయసు కలిగిన ఓ వ్యక్తి రైలు నుంచి కింద పడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రైల్వే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సెల్ నంబర్ 98661 44616 ను సంప్రదించాలని రైల్వే ఎస్‌ఐ మహేంద్ర సూచించారు.
54 గొర్రెల మృత్యువాత
తుగ్గలి: నీటి కోసం వెళ్లి గొర్రెలు మృత్యువాత పడిన ఘటన గురువారం సాయంత్రం బొందిమడుగుల వద్ద చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు వలిబాషా, ఖాజా, అంకాలప్ప, రాయల్, నాగేష్, సుంకన్న గొర్రెలు మేపుకుని చీకటి పడే సమయంలో ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో రోడ్డు పక్కనున్న గుంతలో నీరు తాగేందుకు వెళ్లి జీవాలు ఒకదానిపై ఒకటి పడ్డాయి. ఈ తొక్కిసలాటలో మొత్తం 54 గొర్రెలు మృత్యువాత పడినట్లు కాపరులు తెలిపారు. దాదాపు రూ.7 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.
అన్నదమ్ముళ్లకు జైలు శిక్ష
బండిఆత్మకూరు: మండల పరిధిలోని యర్రగుంట్ల గ్రామానికి చెందిన అన్నదమ్ముళ్లకు నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రామిరెడ్డి గారి రాంభూపాల్ రెడ్డి 10 రోజులు జైలు శిక్ష విధించినట్లు బండి ఆత్మకూరు ఎస్‌ఐ జగన్‌మోహన్ తెలిపారు. వివరాల్లోకెళితే.. లక్కిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, లక్కిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గ్రామంలో అసభ్యంగా తిట్టుకుంటూ, గొడవ పడుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నారని గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి నంద్యాల సెకండ్ క్లాస్ కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి 10 రోజుల జైలు శిక్ష విధించారు.
27 కేజీల గంజాయి స్వాధీనం
కర్నూలు: పేకాట కేసులో నిందితులను పట్టుకునే క్రమంలో 27 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. స్థానిక బుధవారపేటలో టీడీపీ నాయకుడికి చెందిన గోడౌన్‌లో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ నేతృత్వంలో మూడు రోజుల క్రితం పోలీసులు దాడి చేసి తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. మొత్తం 37 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేయగా ఆర్గనైజర్ కొమ్ము రవి పారిపోయాడు. ఈ కేసులో మట్కా నిర్వాహకులు సయ్యద్, షబ్బీర్, అక్బర్‌తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైంది. వీరంతా జొహరాపురం శివారు కేసీ కెనాల్ కుడివైపున ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ గుడిసెలో దాగి ఉన్నట్లు సమాచారం అందడంతో గురువారం నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద 27 కేజీల గంజాయి పట్టుబడినట్లు మూడవ పట్టణ సీఐ శేషయ్య తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్లు సీఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment