ఓటమి భయంతోనే దిగజారుడు మాటలు | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే దిగజారుడు మాటలు

Published Wed, Apr 17 2024 1:30 AM

మాట్లాడుతున్న నాగూరావు నామాజీ   - Sakshi

నారాయణపేట: జిల్లాకేంద్రంలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌పార్టీ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మిగిలిన నేతల ప్రసంగాల్లో పసలేకుండా.. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఓడిపోతుందనే భయం వారిలో కనిపించిందని బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేత నాగూరావు నామాజీ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌ను మించి అబద్ధాలు మాట్లాడుతున్నారని.. ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. కృష్ణా–వికారాబాద్‌ రైల్వేలైన్‌ను తానే తీసుకొచ్చానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. పార్టీ మారి పక్కనే కూర్చున్న మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని అడిగితే చెప్పేవారన్నారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు సైనిక్‌ స్కూల్‌ మంజూరు చేస్తే గత ప్రభుత్వం భూమి కేటాయించకపోవడంతో వెనక్కి వెళ్లిందని తెలిపారు. జీఓనంబర్‌ 69కి శంకుస్థాపన చేశామని.. త్వరలో జిల్లాను సస్యశ్యామలం చేస్తామంటున్న సీఎం ఈ ఎత్తిపోతలకు కేంద్రం కేటాయించే 90 శాతం నిధులు తీసుకోకుండా పనులు చేపడతారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమం కోసం కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. బీజేపీ అభ్యర్థి డీకే అరుణను దొరసాని అని సంభోదించడం కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి తగదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగే ముందు ఏ ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇస్తుందన్న కనీస పరిజ్ఞానం లేకపోవడం, తెలివి లేని తనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. వరద జలాలతో నిర్మించే ఏ ప్రాజెక్టుకు కూడా కేంద్రం జాతీయ హోదా ఇవ్వదని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీశ్యాంసుందర్‌, పట్టణ అధ్యక్షురాలు నర్సమ్మ, పార్టీ పట్టణ అధ్యక్షుడు మిర్చి వెంకటయ్య, ప్రధానకార్యదర్శి అప్పిరెడ్డిపల్లి రాము, దళితమోర్చా జిల్లా అధ్యక్షుడు కృష్ణ, కౌన్సిలర్లు ప్రమీల, అనూష, జయశ్రీ, బీజేవైఎం జిల్లా నాయకుడు శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్‌ గోపాల్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేతనాగూరావు నామాజీ

Advertisement
Advertisement