పల్లెల్లో దళారుల దందా! | Sakshi
Sakshi News home page

పల్లెల్లో దళారుల దందా!

Published Thu, Apr 18 2024 9:35 AM

- - Sakshi

మరికల్‌: ధాన్యం నాణ్యతగా లేదని.. సరిగ్గా ఎండబెట్టలేదని.. వర్షాలు పడితే ధాన్యం మరింత తడిసి నష్టం వాటిళ్లుతుందంటూ.. భయపెట్టడంతోపాటు తూకాల్లో మోసాలకు పాల్పడుతూ రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు కొందరు దళారులు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను లైసెన్స్‌ లేని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి గుట్టుగా పక్క రాష్ట్రమైన కర్ణాటకకు తరలించేస్తున్నారు. ఎక్కువ ధరకు అక్కడి మిల్లర్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో యాసంగి వరి పంటలు కోతకు రావడంతో మార్కెట్‌ శాఖ నుంచి లైసెన్స్‌లు లేని వ్యాపారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. అప్పుడే కోత వేసిన ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేయడమే కాకుండా తూకాల్లో మోసం చేస్తు కర్ణాటక మిల్లర్లకు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.

ధరలు తగ్గించి..

ఉగాది పండుగకు ముందు యాసంగి కోతలు ప్రారంభం కాగానే వ్యాపారులు కర్ణాటక రాష్ట్రం సిందనూర్‌, మాన్వి, గంగవతి, రాయచూర్‌ మిల్లర్ల నుంచి లారీలను రప్పించి క్వింటా ధాన్యం రూ.2,230 నుంచి రూ.2500 వరకు రైతుల వద్ద కొనుగోలు చేశారు. ఉగాది తర్వాత రంజాన్‌ పండుగ రావడంతో వరుసగా వారం రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఈ సమయంలో వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. టెండర్‌ ధరలు తెలియకపోవడంతో మిల్లర్లు, దళారీ వ్యాపారులు కలిసి ధాన్యంలో నాణ్యత లేదని వంకాలు చెప్పి ఏకంగా క్వింటాపై రూ. 400 తగ్గించారు. లేదంటే ధాన్యం ఆరబెట్టి అమ్మితే క్వింటా రూ.2,550కి కొనుగోలు చేస్తామని చెప్పడంతో ఆకాల వర్షాలకు భయపడ్డిన రైతులు తక్కువగా ధరకే విక్రయించి నష్టాలను మూటగట్టుకుంటున్నారు.

దళారీల దందా..

మరికల్‌ మండలం తీలేర్‌, వనపర్తి జిల్లా ఆత్మకూర్‌కు చెందిన దళారులు వరిధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. వీరు గత పదేళ్ల నుంచి ఽవానాకాలం, యాసంగిలో జిల్లా వ్యాప్తంగా పలు మండల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. కోత వేసిన పంటను కొనుగోలు చేయాలని రైతులు ఈ వ్యాపారులకు ఫోన్‌ చేయగానే క్షణాల్లో అక్కడికి వాలిపోతారు. ధాన్యాన్ని పరిశీలించి వారు కోత వేసిన పంటలో తేమ, తాలు, బెర్కు ఉందన్ని ఇలా లేనిపొని పేర్లు పెట్టి మార్కెట్‌ కంటే తక్కువ ధరకు భేరం అడతారు. లేదంటే ఈ ధాన్యాన్ని ఎవరూ కొను గోలు చేయరని, వెళ్లిపోతామని రైతులను భయపెట్టిస్తారు. మొత్తంగా క్వింటా రూ.2100 చొప్పున కొనుగోలు చేసి కర్ణాటక మిల్లర్లకు తరలిస్తున్నారు. అక్కడ క్వింటా రూ.3000 చొప్పున వ్యాపారులకు అమ్ముకుంటున్నట్లు సమాచారం. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి పలుమార్లు ఇంటికి తిప్పించుకొని రూ.100కి రూ.2 చొప్పున కమీషన్‌ గానీ బ్యాగు పేరిట కిలో, తాలు పేరిట కిలో కట్‌ చేసి మిగితా డబ్బులను నెల రోజుల తర్వాత రైతుల చేతిలో పెడుతున్నారు. మార్కెట్‌ శాఖ అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న నకిలీ వ్యాపారులపై వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి ఒకే ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.

మరికల్‌లో లారీలోకి ధాన్యం ఎక్కిస్తున్నఓ దళారీకి చెందిన కూలీలు

ఆదాయమంతాకర్ణాటక రాష్ట్రానికే..

జిల్లాలో యాసంగి సాగులో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం పక్షం రోజుల కిందట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ కేంద్రాలకు రైతులు ధాన్యం తేవడానికి సముఖంగా లేరు. ఇప్పటికే కర్ణాటకలో వరి ధాన్యానికి క్వింటాకు రూ.2,800 నుంచి రూ.3 వేల మధ్య పలకడంతో అక్కడి మిల్లర్లు ఇక్కడి దళారీ వ్యాపారులను రంగంలోకి దింపారు. వారికి నేరుగా లారీలను పంపించి ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మన వ్యవసాయ మార్కెట్లకు రావాల్సిన కమీషన్‌ ఆదాయం కర్ణాటక వ్యవసాయ మార్కెట్లకు, మిల్లర్లకు చేరుతుంది.

95వేల ఎకరాల్లో వరిసాగు

జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో 95,926 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 96 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. కానీ రైతులకు అకాల వర్షాల భయం పట్టుకోవడంతో ధాన్యం ఆరబెట్టెందుకు భయపడి వారు దళారులను సంప్రందిస్తున్నారు. వారు చెప్పిన ధరకే ధాన్యం అమ్ముకోవడంతో తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు.

రైతుల నుంచి తక్కువ ధరకు వరి ధాన్యం కొనుగోలు

కర్ణాటకకు తరలించి.. అధిక ధరకు విక్రయం

చక్రం తిప్పుతున్న తీలేర్‌, ఆత్మకూర్‌ వ్యాపారులు

ఉగాది వరకు క్వింటా రూ.2500పలికిన ధర

ఒక్కసారిగా రూ.400 తగ్గడంతో రైతుల అయోమయం

చర్యలు తీసుకుంటాం

వ్యవసాయ మార్కెట్‌ అనుమతి లేకుండా, రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి మోసం చేసిన లైసెన్స్‌ లేని వ్యాపారులపై తప్పక చర్యలు తీసుకుంటాం. ధాన్యం పక్క రాష్ట్రానికి తరలించకుండా కర్ణాటక సరిహద్దు వద్ద గట్టి నిఘా ఏర్పాటుచేస్తాం.

– దేవాదాసు,

జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి

Advertisement
Advertisement