పకడ్బందీగా సమగ్ర ఇంటింటి సర్వే
నారాయణపేట: జిల్లాలో సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలకు సర్వే ఎలా చేయాలి? ఎన్యూమరేటర్ల బాధ్యతలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించి ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. పురపాలిక, గ్రామాలను ఎన్యూమరేటర్ బ్లాక్‌లుగా విభజించి.. 150 కుటుంబాలకు ఒక బ్లాక్ నంబర్ కేటాయించి ఒక్కో ఎన్యూమరేటర్‌కు ఒక్కో బ్లాక్ బాధ్యతలు అప్పగించాలన్నారు. 2011లో గుర్తించిన బ్లాక్‌లను ప్రామాణికంగా తీసుకొని ఎన్యూమరేటర్లు ప్రస్తుతం ఉన్న కుటుంబాల సంఖ్యను గుర్తించాల్సి ఉంటుందని తెలిపారు. కుటుంబాల సంఖ్య ఆధారంగా ఎన్యూమరేటర్ బ్లాక్‌ల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. సూపర్‌వైజర్లు ఎన్యూమరేటర్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. వివరాల సేకరణ అనంతరం ఆన్‌లైన్ నమోదు సైతం పక్కాగా ఉండాలని, సర్వేలోనే వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ, ఇన్‌చార్జ్ సీపీఓ శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్లు సునీత, భోగిశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సిక్తాపట్నాయక్
Comments
Please login to add a commentAdd a comment