ఇసుక, మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి
నారాయణపేట: జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని అధికార యంత్రాంగానికి ఎంపీ, దిశ కమిటీ చైర్ పర్సన్ డీకే అరుణ ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ)మొదటి సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి సమీక్షించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా క్షేత్ర స్థాయిలో సక్రమంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధులతో,కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాల పై నిర్వహించిన సమావేశంలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలో చేనేత జౌళి శాఖ పై సమీక్షిస్తూ శాఖ పరమైన కార్యక్రమాల సమాచారం తనకు ఇవ్వాలని, ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇవ్వాలన్నారు. ఇటీవల చేనేత జౌళి శాఖకు సంబంధించి లబ్ధిదారులకు ఇచ్చే చెక్కులను ఎమ్మెల్యే పీఏ ఎలా అందజేస్తారని, ఎమ్మెల్యే లేకపోతే మున్సిపల్ చైర్‌పర్సన్‌తో చెక్కులు ఇప్పించాలని, పీఏకు ఏం అధికారం ఉందని జౌళి శాఖ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
డీఈఓ పనితీరుపై ఎంపీ అసహనం
విద్యాశాఖపై సమీక్షిస్తూ డీఈఓపై ఎండీ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల ద్వారా జిల్లాలో చేపట్టే నిర్మాణ పనులను ఎవరు ప్రారంభిస్తున్నారని, ఎంపీగా తనకు ముందస్తు సమాచారం ఇవ్వరా అని డీఈఓను ప్రశ్నించారు. అభివృద్ధి నిర్మాణ పనులలో రాజకీయాలకు తావివ్వొద్దని ఆమె పునరుద్ఘాటించారు. నేషనల్ హైవే రహదారి 150, 167, 167ఎన్ పనులపై ఆమె సమీక్షించారు. జిల్లాలో ఆర్‌అండ్‌బీ శాఖ రూ.36 కోట్లతో ప్రతిపాదించిన పెద్దజట్రం నుంచి జక్లేర్ డబుల్ లైన్ రహదారి నిర్మాణ పనులపై ఆరా తీశారు. ముద్ర రుణాలు, పీఎం విశ్వకర్మ పథకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని లీడ్ బ్యాంకు మేనేజర్‌ను ఆమె ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో లోటు పాట్లు ఉంటే సరి చేసుకుని పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు.
ఈజీఎస్ పథకం ద్వారా భవనాలు నిర్మించాలి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో పంచాయతీ, అంగన్‌వాడీ భవనలను నిర్మించాలని ఎంపీ సూచించారు. గ్రామాలలో సీసీ రోడ్లు నిర్మించాలని సూచించారు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలాన్నారు. ప్రజారోగ్య శాఖ అధికారి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల అభివృద్ధి పనుల వివరిస్తూ అమృత్ 2.0 కింద నారాయణపేట మున్సిపాలిటీలో రూ.27.66 కోట్ల అంచనా, కోస్గిలో 12.53 కోట్లు ఉండగా, మక్తలో రూ.15.38 కోట్ల అంచనా మొత్తానికి మంజూరు చేయబడిందన్నారు. అలాగే మూడు మున్సిపాలిటీల కమిషనర్లు ఆయా మున్సిపాలిటీలలో 15 ఆర్థిక సంఘం నిధుల వినియోగం, పీఎం విశ్వకర్మ పథకం వివరాలను తెలిపారు.
మూడు నెలలకు ఒక సారి దిశ సమావేశం
ఐసీడీఎస్, ఎస్సీ కార్పొరేషన్ తదితర పనులు, అమలవుతున్న కేంద్ర పథకాలపై ఆయా శాఖల అధికారులతో పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకునేలా దిశ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశం ప్రతి మూడు నెలలకొకసారి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జనవరిలో జరిగే సమావేశంలో పథకాల ప్రగతిపై సమీక్ష చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆర్డీఓ రామచంద్రనాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా అధికారులు నవీన్ రెడ్డి, జ్యోతి, సౌభాగ్యలక్ష్మి, జాన్ సుధాకర్, ఎం.ఏ. రషీద్, రెహమాన్, ఉమాపతి, ఖలీల్, దేవదాస్ పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా
అభివృద్ధి చేయాలి
జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎంపీ డీకే అరుణ
Comments
Please login to add a commentAdd a comment