సన్నాలకే రూ.500 బోనస్‌ | - | Sakshi
Sakshi News home page

సన్నాలకే రూ.500 బోనస్‌

Published Thu, Oct 31 2024 1:13 AM | Last Updated on Thu, Oct 31 2024 1:14 AM

సన్నా

సన్నాలకే రూ.500 బోనస్‌

నారాయణపేట: ప్రభుత్వం ప్రకటించిన విధంగా వరి సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్‌ చెల్లిస్తామని.. దొడ్డు రకం ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని.. ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాకు రూ.2,320 (సన్నరకాలు), బి గ్రేడ్‌ దొడ్డు రకానికి రూ. 2,300 నిర్ణయించారని.. గన్నీ బ్యాగులు పొలాల వద్దకు తీసుకెళ్లేందుకు ఇవ్వరని.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని.. సివిల్‌ సప్లయ్‌ డీఎం దేవదాసు అన్నారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లాలో పలువురు రైతులు అడిగిన ప్రశ్నలకు ఫోన్‌ ఇన్‌ ద్వారా సివిల్‌ సప్లయ్‌ డిఎం సమాధానాలు ఇచ్చారు. సన్నరకం ధాన్యాన్ని గ్రెయిన్‌ కాలిపర్‌ యంత్రంతో పరిశీలిస్తారని, తేమ శాతం 17 లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామని.. ట్రక్‌షీట్‌ వచ్చిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుందని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలిలా..

ప్రశ్న: కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారు.. ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు ? మార్గదర్శకాలు ఏమిటీ ?

– కుర్మయ్య, రైతు (గొల్లపల్లి), అనంత్‌రెడ్డి, రైతు (నారాయణపేట)

సి.స.డీఎం: వానాకాలం రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం. జిల్లా వ్యాప్తంగా 95 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశాం. అందులో ఐకేపీ 31, పీఎసీఎస్‌ 60, మెప్మా 2, ఎఫ్‌పీఓ 2 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. నవంబర్‌ 1 నుంచి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించవచ్చు. కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఎక్కడా ఇబ్బందులు తెలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. గైడ్‌లైన్స్‌ ప్రతి సెంటర్‌ వద్ద ప్లెక్సీ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.

ప్రశ్న: టార్పాలిన్‌ కవర్లు ఎక్కడ ఇస్తారు.. బీపీటీ సోనా, ఆర్‌ఎన్‌ఆర్‌కు ఒకటే రేటు ఇస్తారా..?

– బీమప్ప, రైతు (దామరగిద్ద), పెద్దింటి రాజ, రైతు (మాగనూర్‌)

డీఎం: ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచుతున్నాం. అవసరమైతే ఫ్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచాం. కొనుగోలు కేంద్రాలను సంప్రదించి టార్పాలిన్‌ కవర్లు పొందవచ్చు. బీపీటీ సోనా, ఆర్‌ఎన్‌ఆర్‌ తెలంగాణ సోనాకు ఒకటే మద్దతు ధర క్వింటాకు రూ.2,320తో పాటు బోనస్‌ రూ. 500 చెల్లిస్తారు.

ప్రశ్న: హమాలీ చార్జీలు, ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలు ఇస్తారా ?

– గోవర్ధన్‌రెడ్డి, రైతు (దామరగిద్ద)

డీఎం: కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ధాన్యానికి రైతులే ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలు చెల్లించుకోవాలి. తూకం చేసే సమయంలో హమాలీ చార్జీలు రైతులే భరించాలి.

ప్రశ్న: సన్న రకాలను ఏవిధంగా గుర్తిస్తారు ? వడ్లు తేమ శాతం ఎంత ఉండాలి?

– నర్సింహులు, రైతు (ఎర్గాట్‌పల్లి), అశోక్‌కుమార్‌, రైతు (బిజ్వార్‌)

డీఎం: వడ్లు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చేటప్పుడు 17 శాతం లోపు ఉండాలి. ఈ సీజన్‌లో గ్రెయిన్‌కాలిపర్‌ యంత్రాన్ని ఉపయోగించనున్నారు. కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని గింజ పొడవు, వెడల్పు కొలుస్తారు. బీపీటీ సోనా, ఆర్‌ఎన్‌ఆర్‌ (తెలంగాణ సోనా), ఎంటీయూ 1271, హెచ్‌ఎంటీ సోనా తదితర సన్నరకాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. సన్నాల గుర్తింపునకు వ్యవసాయ శాఖ ఏఈఓల సహకారం తీసుకుంటున్నాం. సన్నరకాలు 13, 14 శాతం ఉంటే ఇంకా మంచిది. 17 శాతం కంటే ఎక్కువ ఉంటే రిజెక్ట్‌ అవుతాయి. రైతులు ధాన్యాన్ని పొలం దగ్గరే కల్లాలను ఏర్పాటు చేసుకొని ఆరబెట్టుకొని తీసుకువచ్చి సహకరించాలని కోరుతున్నాం.

ప్రశ్న: బొనుగుల వడ్లు కొంటారా.. దొడ్డు రకం వడ్లకు మద్దతు ధర ఎంత ?

– అంజయ్య, రైతు (నారాయణపేట)

డీఎం: దొడ్డు రకమైన వడ్లను క్వింటాకు మద్దతు రూ.2,300కు కొనుగోలు చేస్తాం. కొనుగోలు కేంద్రంలో సన్నరకం, దొడ్డు రకం వడ్లను వేర్వేరుగా కొనుగోలు చేస్తారు. బొనుగుల వడ్లు కొనుగోలు చేస్తాం.

ప్రశ్న: క్వింటాకు రెండు, మూడు కిలోల తరుగు తీస్తారు. బస్తాకు ఎంత తూకం వేస్తారు ? కొనుగోలు కేంద్రం వద్ద టెంట్‌, తాగునీటి సౌకర్యం కల్పించాలి. సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి.

– అంజిలయ్యగౌడ్‌, రైతు (ముస్తాపేట్‌)

డీఎం: బస్తాకు 650 గ్రాములు తూకం వేస్తారు. అంటే ఒక బస్తా తూకం చేస్తే 40 కిలోల 650 గ్రాములు ఉండాలి. ఆ పైన తూకం చేసినట్లు, మిల్లులో తరుగు తీస్తున్నట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. తేమ శాతం 17 లోపు ఉంటే తరుగు తీసే ప్రసక్తే లేదు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకురావాలి. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద మంచినీటి సౌకర్యం, టెంట్‌ సైతం వేయించాలని ఇది వరకే నిర్వాహకులకు ఆదేశించాం. కొనుగోలు కేంద్రాల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయిస్తాం.

ప్రశ్న: ఖాళీ గన్నీ బ్యాగులు పొలాల వద్దకు ఇస్తారా..?

– రవి తేజ, రైతు (ఉప్పర్‌పల్లి), గడ్డం సాయూబ్‌, రైతు (కొల్లంపల్లి), రాజశేఖర్‌రెడ్డి, రైతు (ఎడవెళ్లి), కావలి వెంకటేశ్‌, రైతు (కొటకొండ), మహిపాల్‌రెడ్డి, రైతు (ఒబ్లాపూర్‌)

డీఎం: ఖాళీ గన్ని బ్యాగులు ఈ సారి పొలాలకు ఇవ్వడం లేదు. కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యాన్ని మీ బస్తాల్లోనే తీసుకురావాలి. తేమ శాతం 17 శాతం లోపు ఉంటేనే గన్నీ బ్యాగులు ఇస్తారు.

ప్రశ్న: కొన్ని చోట్ల తూకాల్లో మోసాలు అవుతాయి. కాంటాలను ముందుగానే తనిఖీ చేయండి.

– వెంకోభ, బీకేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి

డీఎం: సివిల్‌ సప్లయ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాన్ని ముందుగా పంపించి కాంటాలను తనిఖీ చేయిస్తాం. మిల్లులోని వేయింగ్‌ మిషన్లను సైతం పరిశీలిస్తాం. తూకాల్లో మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే విచారించి చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: సన్న రకాలకు బోనస్‌ ఎలా ఇస్తారు, డబ్బులు ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారు ?

– కుమ్మరి లక్ష్మణ్‌, రైతు (ఊట్కూర్‌)

డీఎం: రైతులు సన్నరకం ధాన్యం విక్రయించిన తర్వాత ట్రక్‌షీట్‌ వచ్చిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో క్వింటాకు రూ.2,320 చొప్పున జమ చేస్తారు. సివిల్‌ సప్లయ్‌ డీఎం కార్యాలయం నుంచి డీఎస్‌ఓ లాగిన్‌కు రైతుల వివరాలను పంపిస్తాం. అక్కడి నుంచి రైతుల ఖాతాల్లో బోనస్‌ డబ్బులు క్వింటా చొప్పున జమ అవుతాయి.

దొడ్డు రకమూ కొనుగోలు చేస్తాం

ఏ గ్రేడ్‌కు రూ.2,320.. బి గ్రేడ్‌కు రూ.2300

ప్రత్యేక యంత్రాలతో సన్నాల గుర్తింపు.. తేమ 17శాతం లోపే ఉండాలి

గన్నీ బ్యాగులు పొలాల వద్దకు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు

రైతు ఖాతాల్లో నేరుగా నగదు జమ

‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌లో సివిల్‌ సప్లయ్‌ డీఎం దేవదాసు

No comments yet. Be the first to comment!
Add a comment
సన్నాలకే రూ.500 బోనస్‌1
1/1

సన్నాలకే రూ.500 బోనస్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement