భవిష్యత్‌కు బాటలు వేద్దాం
నారాయణపేట/నారాయణపేట రూరల్: తల్లిదండ్రులు లేని పిల్లలకు సరికొత్త జీవితాన్ని అందిస్తూ.. వారి కష్టాలు, కన్నీళ్లను దూరం చేసి భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు బాటలు వేయడమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా ముందడుగు వేద్దానమి కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ‘సాక్షి’ దినపత్రిక, లయన్స్‌క్లబ్ ఆఫ్ నారాయణపేటటౌన్ వారితో కలిసి గురువారం జిల్లా కేంద్రంలోని బాలసదనంలో చిల్డ్రన్స్ డే వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై చిన్నారులతో సరదాగా గడిపారు. రోజువారి దినచర్య, భోజనం మెనూ, చదువు, క్రీడలు, సాంస్కృతిక అంశాలకు సంబందించిన విషయాలను మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలను తిలకించి వారిని ప్రోత్సహించడంతో పాటు క్రీడాపోటీల విజేతలకు బహుమతులు అందించి అభినందించారు. అంతకుముందు నెహ్రూ చిత్రపటానికి పూజలు చేసి కార్యక్రమం ప్రారంభించగా.. కలెక్టర్‌తో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయకు చిన్నారులు గులాబీ పువ్వులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని, విద్యతోనే భవిష్యత్ అని.. క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. బాలసదనంలో పిల్లలకు చక్కటి ఏర్పాట్లు ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాలల చట్టాలపై అవగాహన కల్గి ఉండాలని, పిల్లలను పనిలో పెడితే చట్ట ప్రకారం శిక్షార్హులన్నారు. బాల్యవివాహాలు చేయడం నేరమని హెచ్చరించారు.
మీడియా నాలుగో స్తంభం
ప్రభుత్వానికి, ప్రజలకు మద్య వారధిలా ఉండే మీడియా సమాజానికి నాలుగో స్తంభమని, విలువలతో కూడిన జర్నలిజాన్ని కొనసాగించడం హర్షణీయమన్నారు. ‘సాక్షి’ దినపత్రిక ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమన్నారు. జర్నలిస్టులు చేస్తున్న సేవలు ఎంతో ఉన్నతమైనవని, కోవిడ్ వంటి క్లిష్ట సమయంలో కుటుంబం, తమ ప్రాణాలను తెగించి సేవలను అందించారని కొనియాడారు. సమాజంలో పేదల కోసం లయన్స్‌క్లబ్ చేస్తున్న సేవలు ఎంతో అభినందించాల్సిన విషయమని అన్నారు. టౌన్ క్లబ్ సేవలను తెలుసుకోవడంతోపాటు విజేతలకు చెస్‌బోర్డు, క్యారమ్స్ తదితర క్రీడా వస్తువులను అందించడంపై అధ్యక్షుడు లిఖి రఘుబాబును అభినందించారు.
ప్రధాన సమస్యలపరిష్కారం దిశగా..
బాలసదనంలో బాలల దినోత్సవం నిమిత్తం వెళ్లిన ‘సాక్షి’ బృందం అక్కడి సమస్యలను గుర్తించి సమావేశంలోని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిన్నారులకు హాల్ లేకపోవడంతో కార్యక్రమాల నిర్వహణ, ఇతర విషయాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో షెడ్ ఏర్పాటు ప్రతిపాదనపై మున్సిపల్ చైర్ పర్సన్ గందె అనసూయ స్పందించారు. నిర్మాణానికి సంబందించిన విషయం కలెక్టర్, ఎమ్మెల్యేతో మాట్లాడతానని చెప్పారు. చిన్నారులు పాఠశాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందిపై టౌన్ లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు రఘుబాబు స్పందిస్తూ.. వాహన సౌకర్యంపై అన్ని క్లబ్‌లతో చర్చించి సమస్య పరిష్కారానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ‘సాక్షి’ కార్యక్రమంతో ప్రధాన సమస్యలకు తాత్కాలిక పరిష్కారం లభించడంపై విద్యార్థులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ అధికారి ఎండీ రషీద్, సీడబ్ల్యూసీ చైర్మన్ అశోక్ శ్యామల, సభ్యులు కమలమ్మ, యాదయ్య, డీసీపీఓ తిరుపతయ్య, చిల్డ్రన్ హోం ఇన్‌చార్జ్ నిహారిక, డాక్టర్ విరోజ, సాక్షి సిబ్బంది ఆనంద్‌గౌడ్, రాజేష్‌కుమార్ పాల్గొన్నారు.
తల్లిదండ్రులు లేని పిల్లలకు సరికొత్త జీవితాన్ని అందిద్దాం
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
మీడియా ఇలాంటి కార్యక్రమాలునిర్వహించడం భేష్
‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్
Comments
Please login to add a commentAdd a comment