ఇది ప్రజా ప్రభుత్వం
● ప్రజాపాలన విజయోత్సవాల్లోఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
● అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు
నారాయణపేట: ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమని.. ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్స్‌లో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్ పర్సన్ ప్రొఫెసర్ అలేఖ్య పుంజల బృందంచే సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజా పాలన పథకాలపై సంగీత, నాటక, నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల కాలంలోనే ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసిందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తోందని తెలిపారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను యూపీఎస్సీ తరహాలో పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియామకాల ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు జరుపుకొంటున్నట్లు, ప్రభుత్వం పిల్లలు, మహిళలు, యువత, వృద్ధులు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాల ఫలాలు అందజేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అడ్మినిస్ట్రేషన్ తరపున అర్హులందరికీ లబ్ధి చేకూర్చే విధంగా తనతో పాటు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. బుధవారం రాత్రి వరకు అట్టహాసంగా కొనసాగిన ఈ ప్రజా విజయోత్సవాలకు ప్రజలు, మహిళలు, యువతి, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ యోగేష్ గౌతమ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ శాలం,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె అనసూయ, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment