డేటా ఎంట్రీ ఆపరేటర్ల పాత్ర కీలకం
నారాయణపేట: సమగ్ర కుటుంబ ఇంటి సర్వే ఫారాల నమోదులో డేటా ఎంట్రీ ఆపరేటర్ల పాత్ర ఎంతో కీలకమని అడిషనల్ కలెక్టర్ బేన్ షాలం అన్నారు. బుధవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే వివరాల నమోదుపై జిల్లాలోని మీసేవ, కామన్ సర్వీస్ సెంటర్, తహసీల్దార్, ఎంపీడీవో, మున్సిపాలిటీ కార్యాలయాల్లో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సర్వే వంద శాతం పూర్తయిన తర్వాత సర్వే ఫారాలలోని అన్ని వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయాల్సి ఉంటుందని, వివరాల నమోదు విషయంలో ఆపరేటర్లు ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వరాదన్నారు. ఎన్యుమరేటర్లు సేకరించిన ఇంటింటి వివరాల నమోదు ప్రక్రియ సమయంలో ఆయా ఈ.బీ లకు సంబంధించిన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్ల సమక్షంలోనే జరుగుతుందని, ఆపరేటర్లు కంప్యూటర్‌లో నమోదు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించాలని, ఆ ఫారాలలో ఏం ఉంటే ఆ వివరాలనే నమోదు చేయాలని తెలిపారు. కుటుంబ వివరాల నమోదును గోప్యంగా ఉంచాలని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే చేపట్టిందని ఆదేశించారు. శిక్షణలో ఈడీఎం విజయ్ సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఫారాల ఎంట్రీ విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆపరేటర్లకు వివరించారు. కార్యక్రమంలో సిపిఓ యోగానంద్, డీపీఓ కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment