ర్యాగింగ్‌ కలకలం | - | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌ కలకలం

Published Sat, Nov 16 2024 8:00 AM | Last Updated on Sat, Nov 16 2024 8:00 AM

ర్యాగ

ర్యాగింగ్‌ కలకలం

పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో వెలుగులోకి..

గోడకుర్చీలు వేయించడంతోజూనియర్ల మనస్తాపం

10 మంది సీనియర్‌వైద్య విద్యార్థుల సస్పెన్షన్‌

యాంటీ ర్యాగింగ్‌ కమిటీ పనితీరుపై విమర్శలు

తూతూమంత్రంగా అవగాహన కార్యక్రమాలు

పోలీస్‌శాఖ చొరవ చూపాలని సూచిస్తున్న విద్యారంగ నిపుణులు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. సీనియర్‌ మెడికోలు అది, ఇది అంటూ జూనియర్లకు పని చెప్పడం.. చేయకపోతే గోడ కుర్చీలు వేయించడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు ర్యాగింగ్‌కు పాల్పడిన పదిమంది సీనియర్‌ వైద్య విద్యార్థులను 20 రోజుల పాటు సస్పెన్షన్‌ వేటు చేశారు. అయితే ఈ ఘటనపై అధికారులు చెరోమాట మాట్లాడుతుండడం అనుమానాలకు తావిస్తోంది. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో సదరు విద్యార్థులకు పనిష్మెంట్‌ ఇచ్చామని అంటుండగా.. మరో అధికారి ఆల్కహాల్‌ సేవించి రావడంతో చర్యలు తీసుకున్నామని చెబుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కమిటీ ఉన్నట్టా.. లేనట్టా.. ?

కళాశాలలో ర్యాగింగ్‌ ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో యాంటీ ర్యాగింగ్‌ కమిటీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాంటీ ర్యాగింగ్‌ కమిటీలో వైద్యకళాశాలతో పాటు పోలీస్‌ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు మెంబర్లుగా ఉంటారు. వీరు ఎన్జీఓలు, మీడియా, విద్యార్థులు, తల్లిదండ్రు ల భాగస్వామ్యంతో ర్యాగింగ్‌ నివారణకు సమష్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. కానీ.. ఇలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవని విద్యార్థులే చెబుతున్నారు. కొత్తగా తరగతులు ప్రారంభమైన క్రమంలో తప్పకుండా విద్యార్థులతో సమావేశమై ర్యాగింగ్‌పై అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు అలాంటి కార్యక్రమం జరగలేదని తెలిసింది. ఇప్పటికై నా పోలీస్‌శాఖ చొరవ చూపి ర్యాగింగ్‌ భూతాన్ని ఆదిలోనే తరిమికొట్టాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.

గోడ కుర్చీలు వేయించడంతో..

పాలమూరు మెడికల్‌ కళాశాలలో 2024–25 బ్యాచ్‌ తరగతులు ఇటీవల ప్రారంభమయ్యాయి. 175 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఇటీవల ఫస్టియర్‌లో చేరారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోని ఎదిర సమీపంలో ఉన్న కళాశాల క్యాంపస్‌లో 2023 బ్యాచ్‌కు చెందిన కొందరు సీనియర్లు.. కొత్తగా వచ్చిన జూనియర్లపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నించారు. సుమారు రెండు వారాలుగా వారితో ఏదో ఒక పని చేపిస్తూ వచ్చారు. అయితే పది రోజుల క్రితం రాత్రి తాము చెప్పిన పని చేయడం లేదని పలువురు జూనియర్లను గోడ కుర్చీలు వేయించారు. మనస్తాపానికి గురైన జూనియర్లు.. సదరు సీనియర్‌ వైద్య విద్యార్థులపై కళాశాల డైరెక్టర్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌..

సీనియర్లపై జూనియర్లు ఫిర్యాదు చేయగా.. డైరెక్టర్‌ రమేష్‌ స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేశారు. నిజమేనని తేలడంతో పదిమంది సదరు సీనియర్‌ వైద్య విద్యార్థుల తల్లిదండ్రులను ఈ నెల పదో తేదీన కళాశాలకు పిలిపించారు. వారి సమక్షంలోనే ఆ విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత సదరు పది మంది విద్యార్థులను క్రమశిక్షణ చర్యల కింద డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు సస్పెండ్‌ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సదరు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో లెటర్లు రాయించుకున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
ర్యాగింగ్‌ కలకలం1
1/1

ర్యాగింగ్‌ కలకలం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement